Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌కు పునర్వైభం తెచ్చేలా రేవంత్ పావులు..
- సీనియర్లకు ధీటుగా జూనియర్ నేతలతో టీమ్ ఏర్పాటు..
- జిల్లాలోని నియోజకవర్గాలల్లో పలు సర్వేలు ..డేటా మొత్తాన్ని సేకరణ...
ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాంగ్రెస్ కంచుకోటగా పేరుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 2014ఎన్నికల్లో సగం సీట్లకే పరిమితమయ్యింది. ఇక 2018ఎన్నికల్లో ఒకటి, రెండు స్దానాలకే పరిమితమయ్యింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి , నల్లగొండ ఎం.పీ సీట్లు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయి..ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలంతా సీనియర్లే కావడం మరో విశేషం. తెలుగు రాష్ట్రాల్లోనే తమ మార్కు పాలిటిక్స్ తో గుర్తింపు పొందిన నేతలు.. కాంగ్రెస్ సీ.ఎం అభ్యర్దులు సైతం నల్లగొండ జిల్లా వారే కావడం మరో విశేషం..గ్రూపు పాలిటిక్స్ తో నిత్యం తగువులు పడే సీనియర్ల తీరుతో జూనియర్ నేతలు సైతం సైలెంట్ పాలిటిక్స్ తో ముందుకు సాగాల్సిన పరిస్దితి ఏర్పడిందన్న సొంతపార్టీలోనే వినపడుతుంది. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వంలో మాత్రం భారతదేశంలోనే నల్లగొండ పార్లమెంట్ ముందంజలో ఉండడంతో ఢిల్లీ లీడర్లు సైతం నల్లగొండలో పూర్వ వైభవం తీసుకొచ్చే భాద్యతను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ కు అప్పజెప్పారని ప్రచారం సాగుతోంది. రేవంత్ సైతం తనదైన స్టైళ్లో నల్లగొండ రాజకీయాలను ప్రభావితం చేయాలన్న తలంపుతో ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది.
నవ తెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ ఎం.పీగా మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , భువనగిరి ఎం.పీగా మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గెలుపొందారు. మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోఫాల్ రెడ్డి గెలుపొందారు. ఇక సీనియర్ నేతలైన మాజీ సీఎల్పీ నేత , మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిలు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వరుస విజయాలకు 2018 ఎన్నికల్లో బ్రేక్ పడింది. వెంటనే భువనగిరి పార్లమెంట్ అభ్యర్దిగా బరిలో నిలిచి గెలిచారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్యాఢర్ బలంగా ఉంది. స్దానిక సంస్దల ఎన్నికలు , మున్సిఫల్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులు గట్టీ పోటీ ఇచ్చారు.
-- రేవంత్ చెంతకు ఉత్తమ్, బ్రదర్స్ వ్యతిరేక వర్గీయులు...
మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోఫాల్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి కంట్లో నలుసుగా మారారు. తరుచూ బి.జె.పికి జై కొడుతుండడంతో కాంగ్రెస్ క్యాఢర్లో అయోమయంలో పడ్డారు. కమలం గూటికి చేరకుండా స్వపక్షంలో విఫక్షంగా మారారు. మాజీ టీ.పీ.సీ.సీ అధ్యక్షుడు నల్లగొండ ఎం.పీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ , హూజూరునగర్ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. నల్లగొండలో ఓడిపోయాక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి ఎం.పీ అభ్యర్దిగా గెలుపొందాక నల్లగొండ వైపు కన్నెత్తి చూడలేదు. పెళ్లిళ్లు ఇతర కార్యక్రమాలకు సైతం చాలకాలం దూరంగా ఉంటూ వచ్చారు. కానీ ఈ మద్య నియోజకవర్గంలో దూకుడు పెంచారు. దుబ్బాక నర్సింహ్మారెడ్డి దూకుడు పెంచకుండా, కోమటిరెడ్డి తన అనుచరులతో టచ్‌లో ఉంటూ తాను నల్లగొండను వీడనని, వచ్చే శాసనసభ ఎన్నికలలో ఇక్కడి నుంచే ఎమ్మేల్యేగా పోటీచేస్తానని సంకేతాలు ఇవ్వడంతో దుబ్బాక నర్సింహ్మారెడ్డి టీ.పీ.సీ.సీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేత కుందూరు జానారెడ్డి, టీ.పీ.సీ.సీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కోమటిరెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఒకటవడంతో జిల్లాలో ఉత్తమ్ , కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యతిరేక వర్గీయులు రేవంత్ కు దగ్గరవుతున్నారు.
సీనియర్ నేత కుందూరు జానారెడ్డి మాత్రం ఉపఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా తాను పోరాడి ఓడిన లీడర్‌గా ఢిల్లీ పెద్దలను మెప్పించారు. కాంగ్రెస్ పార్టీలోగ్రూప్ వార్‌ను నిలువరించే పెద్దన్న పాత్ర పోషిస్తూ సోనియాగాంధీ తో నేరుగా టచ్‌లో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో జానారెడ్డి నల్లగొండ పార్లమెంట్ లేదంటే మిర్యాలగూడ నుంచి బరిలో ఉండనున్నారని తెలుస్తుంది. తాను మిర్యాలగూడ నుంచి ఎమ్మెల్యే అభ్యర్దిగా బరిలో ఉంటే తన ఇద్దరు కుమారుల్లో పెద్దవాడైన రఘువీర్ ను సాగర్ నుంచి లేదంటే జై వీర్ ను సాగర్ నుంచి రఘువీర్ ను పార్లమెంట్ కు బరిలో నిలుపుతానని ఢిల్లీ పెద్దలకు తేల్చి చెప్పారని సీనియర్ నేతలంటున్నారు.
-- జిల్లాలో అభ్యర్థులపై రేవంత్ టీమ్ సర్వే..?
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీట్లు ఎక్కువగా గెలిచే అవకాశం ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాను హస్తగతం చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు తన సర్వే టీమ్‌లతో తాను బరిలో నిలపాలనుకున్న అభ్యర్దుల పేర్లపై సర్వేలు చేయించారని సమాచారం. సూర్యాపేటలో తన అనుచరుడైన పటేల్ రమేష్‌రెడ్డిని ఒప్పించడమా లేక మాజీ మంత్రి దామోదర్‌రెడ్డిని పాలేరుకు పంపాలా అన్న దిశగా ఆలోచన చేస్తున్నారని సమాచారం. తన అనుచరుడైన రమేష్ రెడ్డిని ఒప్పించి దామోదర్‌రెడ్డి గెలుపు తన ఖాతాలో వేసుకునేందుకు సిద్దం అవుతున్నారని సమాచారం. దామోదర్‌రెడ్డి తనయుడిని సైతం యాక్టివ్ పాలిటిక్స్‌లోకి ఆహ్వానించినట్లు తెలుస్తుంది. పోల్ మేనేజ్ మెంట్ తో పాటు స్టాటజీస్ట్ గా పేరున్న సర్వోత్తమ్ రెడ్డిని భువనగిరి ఎం.పీగా బరిలో ఉండేలా పలు సూచనలు చేశారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ సీ.ఎం అభ్యర్దిగా పేరున్న సీనియర్ లీడర్ కుందూరు జానారెడ్డి తో ముందు నుంచి సత్సంబంధాలు కల్గిన రేవంత్ రెడ్డి రాజీ ఫార్మూలాతో, సూచనలు, సలహాలు తీసుకుంటు ముందుకు సాగుతున్నారు. జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి రాహూల్ కోర్ టీమ్ మెంబర్ కావడం, రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో పాటు టీ.పీ.సీ.సీ అధ్యక్షుడిగా చేయడంలో రఘువీర్‌రెడ్డి కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.. కుందూరు రఘువీర్ రెడ్డి మిర్యాలగూడ టిక్కెట్ అడుగుతుండడంతో రేవంత్ సైతం ఓకే చెప్పేయడంతో పాటు ఢిల్లీ హైకమాండ్‌కు గతంలో 2018అసెంబ్లీ, 2019 ఫార్లమెంట్ ఎన్నికల్లో కుందూరు రఘువీర్ కు టిక్కెట్ విషయంలో జరిగిన అన్యాయం, రాహూల్ గాంధీ రఘువీర్ కు ఇచ్చిన హామీ సైతం గుర్తు చేయడంతో గ్రీన్ సిగల్ ఇచ్చినట్లు తెలిసింది. జానారెడ్డి మరో తనయుడైన జైవీర్‌రెడ్డి సైతం యాక్టివ్ పాలిటిక్స్ తో దూసుకుపోతుండడంతో రేవంత్ కుందూరు బ్రదర్స్ కు తన పూర్తి సహాయ సహకారాలు అందించి జిల్లాలో సీనియర్లకు యంగ్లీడర్స్ తోనే చెక్ పెట్టే పనిలో ఉన్నారని సమాచారం. కోమటిరెడ్డి బ్రదర్స్ వివాదాస్పద వ్యాఖ్యలతో ముందుకు సాగుతుండగా ఉత్తమ్ తీరు రేవంత్ కు ఇబ్బందికరంగా మారుతుండడంతో సీనియర్ నేతలైన రాంరెడ్డి దామోదర్ రెడ్డి , కుందూరు జానారెడ్డి తనయులను తన టీమ్ లో చేర్చుకుని రానున్న ఎన్నికల్లో యంగ్ లీడర్స్ ను బరిలో నిలిపి గెలుపే మంత్రంతో ముందుకు సాగేలా రేవంత్ నల్లగొండపై ద్రుష్టి సారించారని సమాచారం. నకిరేకల్, దేవరకొండ, మునుగోడు, ఆలేరు, తుంగతుర్తి, నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్దుల ఎంపిక భాద్యతను సైతం రేవంత్ భూజానికెత్తుకున్నట్లు సమాచారం. సభ్యత్వ నమోదు తో పాటు టీ.పీ.సీ.సీ పిలుపుకు స్పందించిన నేతలకు తన సోర్ట్ ఇస్తూ నల్లగొండ పాలిటిక్స్ లో రేవంత్ మార్క్ చూపేందుకు రె'ఢ''అవుతున్నట్లు తెలుస్తుంది.