Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
ప్రతి ఒక్కరూ ముందు కంటి చూపును కాపా డుకోవాలని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి సూ పరిండెంట్ డాక్టర్ లచ్చూనాయక్ అన్నారు. శుక్రవా రం ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. తెలిసోతెలియకో కొంతమంది కంటి వ్యాధుల బారిన పడటంతో జీవితం అంధకారమయం అవుతోందని పేర్కొ న్నారు. జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైనదిగా గ్లకోమాను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటికాసులు, నల్లముత్యంగా వ్యవహరించే ఈ వ్యాధి తెలియకుండానే కళ్లపై దాడి చేస్తోందని తెలిపారు. కంటి చూపును శాశ్వతంగా దూరం చేసి చీకటిమయం చేసేస్తోందనారు. ప్రపంచ వ్యాప్తంగా 6 కోట్ల మంది, భారతదేశంలో 1.2కోట్ల మంది కంటే ఎక్కువగా గ్లకోమా కారణంగా చూపును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే జనాభాలో ఒక శాతం దీని బారిన పడుతున్నారంటే ఈ వ్యాధి ఎంత తీవ్రంగా ప్రభావం చూపుతోందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రారంభంలోనే ముందు చూపుతో వ్యవహరించి దీనిని గుర్తిస్తే నివారించడం సాధ్యమని స్పష్టం చేశారు. ఈ వ్యాధిపై అవగాహన లేకపోవడంతో ఎక్కువ మంది దీని బారిన పడుతున్నారని తెలిపారు. గ్లకోమాపై ప్రజల్లో అవగాహన కల్పించి ఆదిలోనే గుర్తించి సరైన చికిత్స అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా మార్చి 11 నుంచి 17 వరకు 'ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా కంటి పరీక్షలు, వ్యాధి నివారణకు సూచనలు, మందులు అందజేస్తారని, అవరసమైతే శస్త్ర చికిత్సలు చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మూర్తి, డాక్టర్ అనితా రాణి, లయన్స్ క్లబ్ సభ్యులు సతీష్ కుమార్, అశోక్ రెడ్డి, విద్యాసాగర్, ఐశ్వర్య, సత్య శ్రీ, రాము ఝాన్సీ, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, కవిత, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.