Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాదాద్రి నారసింహుని కల్యాణం
- పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి అల్లోల దంపతులు
- ముత్యాల తలంబ్రాలు తీసుకొచ్చిన తితిదే
- అంగరంగవైభవంగా యాదాద్రి నారసింహుని కల్యాణం
నవతెలంగాణ-యాదాద్రి
కల్యాణ వేదిక విద్యుత్ కాంతులు విరజిమ్ముతుండగా ...భక్తులజయజయ ధ్వానాలు... గోవింద నామస్మరణలు... మంగళవాయిద్యాలు.. మిన్నంటగా యాదగిరికొండంత భూతల వైకుంఠంగా నయానాంద భరితులను చేసింది. నిత్యహోమ, జప, పారాయణ స్తొత్రాలతో ప్రతి ధ్వనించిన యాదగిరిక్షేత్రం కల్యాణ కాంతులీనింది. ఆకాశమంత పందిరిగా భూదేవంత వేదికగా శ్రీస్వామి వారి కల్యాణ మంటపాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, రకరకాల పూలమాలతో అలంకృతి గావించగా గజవాహనంపై బాలాలయంలోనే ఊరేగించారు. వారంరోజులుగా వివిధ అవతార విశేషాలతో అలంకృతుడైన శ్రీస్వామివారిని పెళ్ళి కుమారుడుగా, అమ్మవారిని పెండ్లి కుమారైగా ముగ్దమోహనంగా ఆచార్యులు ముస్తాబు చేయగా అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు శ్రీనారసింహుడు శుక్రవారం లక్ష్మీదేవిని పరిణయమాడి లక్ష్మీసమేతుడుగా భక్తులకు దర్శనమిచ్చి ఆశీర్వదించారు. భక్తులు తమ బాగ్యోత్సవాలుగా బావించే యాదాద్రీశుని కల్యాణ మహోత్సవం ఎంతో కమనీయంగా.... రమణీయంగా సాగింది. భాజా భజంత్రిలు, మంగళవాయిద్యాలు, సన్నాయినాదాలు, వేదమంత్రాలు, మారుమ్రోగుతుండగా స్వామివారి కల్యాణ వేడుక కన్నుల పండుగగా సాగింది. అప్పుడు యాజ్ఞికులు, ఆచార్యులు కల్యాణ తంతును ప్రారంభించారు. మొదట విశ్వక్సేన పూజ నిర్వహించి, స్వస్తి వాచనం జరిపారు. పిదప బ్రహ్మాది దేవతలు హాజరై ఆశీర్వదించి ఆనందిస్తున్నారని అభివర్ణిస్తుండగా వైష్ణవ సాంపద్రయానుసారం ఆగమశాస్త్రరీత్యా యాజ్ఞికులు, అర్చకులు జిలకర్రబెల్లం కార్యక్రమాన్ని నిర్వహించారు. లక్ష్మీదేవి తండ్రి సముద్రుడు కాళ్ళుకడిగి కన్యాదానం చేయగా మధ్యాహ్నం 12.57 గంటలకు భక్తుల జేజే ద్వానాలు మిన్నంటగా స్వామివారు అమ్మవారికి మాంగళ్యసూత్రాధారణ గావించారు.
తితిదే తలంబ్రాలు, మంత్రి అల్లోల పట్టువస్త్రాల సమర్పణ
ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, ప్రభుత్వ విప్ గొంగిడి సునిత దంపతులు, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మెన్ జి కిషన్‌రావు, యాదాద్రిభువనగిరి జిల్లా కలక్టర్ పమేలా సత్పతి, ఆర్డీవో భూపాల్‌రెడ్డిలు స్వామివారి కల్యాణ వేడుకకు విచ్చేశారు. ఈ సందర్భంగా కవచ మూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవదాయశాఖ మంత్రి శ్రీస్వామివారికి, అమ్మవారికి పట్టువస్త్రాలు, తితిదే ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కల్యాణ మహోత్సవాన్ని తిలకించారు. లోక కల్యాణ కాంక్షితుడి కల్యాణ మహోత్సవం లోకకల్యాణం కోసం శుభిక్షం కోసం జరుపుకుందని పండితులు ప్రవచించారు.
మంత్రి 99లక్షల విరాళం...
స్వామివారి దివ్య విమాన గోపురానికి బంగారు తాపడానికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తిరుకల్యాణ మహోత్సవం సందర్భంగా 99లక్షల 8వేల 454లు విరాళంగా ఆలయ ఇంచార్జీ ఈవో గీతకు అందజేశారు.
జాతరలో నేడు
జాతరలో భాగంగా నేడు బాలాలయంలో మహా విష్ణువు అలంకారం, గరుడ వాహనం సేవ, రథోత్సవం జరుపబడును.