Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్వాస శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ప్రజలు
- కాలనీలను పరిశీలించిన కాలుష్య నియంత్రణ మండలి ఏఈ
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ పట్టణంలోని పానగల్ రోడ్డులో గల ఎన్జీవోస్ కాలనీ, శ్రీనగర్ కాలనీ, అమూల్య కాలనీ, పానగల్, లెప్రసీ కాలనీ, నందీశ్వర్ కాలనీ వాసులు గత కొన్ని సంవత్సరాల నుండి సమీపంలో ఉన్న రామ్ లక్ష్మణ్ రైస్ మిల్ నుండి వెలువడే పొగ వలన పై కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై కాలనీ వాసులు గతంలో పలుమార్లు జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేయగా నామమాత్రంగా పొగ వెదజల్లకుండా పనులు చేపట్టారు. ప్రస్తుతం రెండు సంవత్సరాల నుండి రైసు మిల్లు నుండి విపరీతంగా నల్లటి పొగ రావడంతో ఈ కాలనీల్లో నివాసముంటున్న ప్రజలు శ్వాస కోశ వ్యాధి బారిన పడుతున్నారు. కాలనీ పరిసర ప్రాంతాల్లోని చెట్లు, భవనాలు, వాటర్ ట్యాంకులు, వాహనాలపై నల్లటి పొగ కమ్ముకు పోతుందని కాలనీ వాసులు ఆరోపించారు. ఈ విషయంపై రెండోసారి కాలనీ వాసులు కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం నియంత్రణ మండలి ఏఈ రవీందర్ కాలనీలోని సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీ వాసుల అభిప్రాయాలను తెలుసుకుని కాలుష్య సమస్యను రాష్ట్ర అధికారులకు తెలియపరిచి తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పరిశీలించిన వారివెంట కాలనీ వాసులు సీహెచ్. సత్యనారాయణ రావ్, విజరు చందర్ రావ్, నూకల వెంకట్ రెడ్డి, శశిధర్ రెడ్డి, వీరబోయిన పంచ లింగం పాల్గొన్నారు.
శ్వాస కోశ వ్యాధితో బాధపడుతున్నాం...
- చౌడోజు ధర్మా చారి, రిటైర్డ్ తహసీల్దార్
మేము గత 20 సంవత్సరాల నుండి ఎన్జీవోస్ కాలనీలో నివాసముంటున్నాము. అప్పటి నుండి రామ లక్ష్మణ్ రైస్ మిల్ నుండి వ్యాపించే నల్లటి పొగతో నా కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు శ్వాస కోశ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని డాక్టర్లు కూడా ధ్రువీకరించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే రైసు మిల్లుపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి.