Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ అధికారులు ప్రజల చేత గౌరవించబడతారని ఆ గౌరవాన్ని మీరు పొందాలంటే గ్రామస్థాయిలో మన ఊరు -మన బడి, మన బస్తీ-మన బడి పనులను మంచిగా చేసి ఆ ఫలాలను ప్రజలకు అందించినట్లయితే అధికారుల గౌరవం మరింత పెరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ఉదయాదిత్య సమావేశ మందిరంలో మన ఊరు మనబడి, మనబస్తీ మనబడి కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మల్లేపల్లి ప్రభుత్వ పాఠశాలలో అత్యధికంగా విద్యార్థులు ఉన్నా అమ్మాయిలకు అవసరమైన టాయిలెట్స్ లేవని, అబ్బాయిలకు అసలే లేవని, విద్యార్థులకు సరిపడే విధంగా తరగతి గదులు లేక తాత్కాలిక రేకుల షెడ్ లో తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే సోమవారం స్వయంగా తాను పాఠశాలను సందర్శిస్తానని, సంబంధిత అధికారులు అందుబాటులో ఉండాలని తెలిపారు. అక్కడ అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా పీఏ పల్లి లో ప్రైమరీ పాఠశాల ఉన్నదని, అక్కడ విద్యార్థులు ఎక్కువగా ఉన్నందున ఆ పాఠశాల సరిపోవడం లేదని తెలిపారు. ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలంలో నూతన పాఠశాల నిర్మాణానికి అనుమతిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కొన్ని పాఠశాలల మధ్యలో నుండి విద్యుత్ వైర్లు ఉన్నట్లు, అవి విద్యార్థులకు ప్రమాదకరంగా ఉన్నాయని వివరించగా సంబంధిత అధికారులతో మాట్లాడాలని అదనపు కలెక్టర్‌కు సూచించారు. కొన్ని పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అని ప్రత్యేకంగా బోధిస్తున్నారని ఇక నుండి అన్ని తరగతులకు కామన్‌గా బోధించాలని ఇంగ్లీష్ మొదటి భాష తెలుగు మాతభాష అయినందున రెండవ భాషగా బోధించాలని తెలిపారు. అధికారులు అనుకున్న స్థాయిలో పనిచేస్తలేరని ప్రజాప్రతినిధుల ఆరోపణలు రాకుండా జాగ్రత్తగా తమ బాధ్యత నిర్వహించాలని, ఎక్కడా అలసత్వం వహించరాదని తెలిపారు. ప్రజాప్రతినిధులకు ఆయా మండలాల లో జరుగుతున్న మన ఊరు మన బడి జాబితాలను అందించి పూర్తి సమాచారం తెలియజేయాల్సిందిగా ఎంపీడీఓలను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పాఠశాలల జాబితా ప్రకారం అంచనాలు రూపొందించి వెంటనే డీఈఓకు సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రైనీ కలెక్టర్ అపూర్వ చౌహన్, మిర్యాలగూడ ఆర్డీఓ. రోహిత్ సింగ్, డీఈఓ బిక్షపతి, జిల్లా పరిషత్ సీఈఓ బ్రహ్మ చారి, హౌసింగ్ పీడీ రాజ్ కుమార్, ఎల్ డీఎం సూర్యం, పంచాయతీ రాజ్ ఈఈలు తిరుపతయ్య, మాధవి పాల్గొన్నారు.