Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిర్యాలగూడ :మహిళా సంక్షేమం, భద్రతలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉన్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ఉద్ఘాటించారు. మహిళలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సష్టిస్తారని అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని మినా ఇంజినీరింగ్ మహిళా కళాశాలలో శనివారం రాత్రి నిర్వహించిన వార్షికోత్సవంలో కళాశాల చైర్మన్ మహిమూద్ అలీతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత కేంద్రంగా పని చేస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం అన్నారు. మహిళలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. మహిళల భద్రత కోసం షీటీమ్స్, వృద్ధ మహిళలు, ఒంటరి మహిళలు, వితంతువులకు పెన్షన్లు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, కేసీఆర్ కిట్, అంగన్వాడీ, ఆశావర్కర్లకు వేతనాల పెంపు సహా వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేం దుకు వి-హబ్ వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నదని అన్నారు. అత్యుత్తమ ఫలితాలను ప్రదర్శించడంతో పాటు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయకముందే అనేక బహుళ జాతీయ కంపెనీల్లో ఆన్ క్యాంపస్ విధానంలో ఉద్యోగాలకు ఎంపికవు తున్నారని తెలుసుకొని సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. మహిళలకు సరైన ప్రోత్సాహం, ఆర్ధిక స్తోమత లేకపోవడం వల్ల పారిశ్రామిక వేత్తలుగా రాణించలేక పోతున్నారని, వీరికి సరైన చేయూత అందిస్తే ఎవరికీ తీసిపోని విధంగా, ప్రపంచం గర్వించే విధంగా ఎదుగుతారని అన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలను రూపొందించడానికి వి.హబ్ చేస్తున్న కషి అభినందించదగిందని అన్నారు. అనంతరం విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. కార్యక్రమంలో మినా ఇంజినీరింగ్ మహిళా కళాశాల డైరెక్టర్ షెహ్లా బుటూ ల్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.షాజీ, ఆర్డీవో రోహిత్ సింగ్, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, టూ టౌన్ ఇన్స్ పెక్టర్ నిగిడాల సురేశ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మక్దూం పాషా, కౌన్సిలర్ ఉదరు భాస్కర్, నాయకులు, గొంగిడి సైదిరెడ్డి, అహ్మద్ చావూష్ పాల్గొన్నారు.