Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఉపాధ్యాయ సమస్యలపై బలమైన పోరాటాలు చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రాంతీయ కార్యాలయ నిర్మాణ పనులను ఆదివారం ప్రారంభించారు. అనంతరం టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు బక్క శ్రీనివాస్ చారి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు ఐక్యంగా ఉండి హక్కుల సాధన కోసం సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేయాలి అన్నారు. విద్యార్థులు గుణాత్మక విద్య అందించి వారిని తీర్చిదిద్దాలని కోరారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ 25 సంవత్సరాల స్వప్నం సాకారమైంది అని అన్నారు. తాను 1983 న యూటీఎఫ్ సంఘం మిర్యాలగూడ సమితిలో చేరడం జరిగిందని, ఈ ప్రాంత ఉద్యమాన్ని అతితక్కువ మందితో ప్రారంభించామని, సమితిల నుండి మండలాలు ఏర్పడ్డాయని, నేను వేములపల్లి మండల బాధ్యుడిగా, అలాగే 2001 లో జిల్లా బాధ్యతలు తీసుకున్నామని, అదే సంవత్సరంలోనే జిల్లా కార్యాలయాన్ని నిర్మించుకున్నామని, టీచర్ల విరాళాలతోనే భవనం నిర్మించుకోవాలని, ఎక్కువ మంది టీచర్ల సహకారంతో భవనం పూర్తి చేయాలని, మన సంఘానికి హక్కులు, బాధ్యతలు రెండు నేత్రాలని అన్నారు. అధ్యయనం, అధ్యాపనం ,సామాజిక స్పృహ అనే లక్ష్యాలతో సంఘం పని చేస్తుందని, ఈ భవనం అధ్యయన కేంద్రంగా ఏర్పాటు కావాలని కోరారు. భవనానికి తన వంతు చందాగా రూ.లక్ష ప్రకటిస్తూ ముందుగా 50 వేల రూపాయల చెక్‌ను డివిజన్ నాయకులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి పూర్వ రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీష్ చంద్ర తండ్రి జ్ఞాపకార్ధం భవననిర్మాణానికి విరాళంగా పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య, రాష్ట్ర కార్యదర్శులు ఎం.రాజశేఖర్ రెడ్డి, జి.నాగమణి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై.సైదులు, పి.వెంకటేశం, పూర్వ అధ్యక్షులు బంగారయ్య, కార్యదర్శులు కె.సురేందర్ రెడ్డి, రమణారెడ్డి, సత్యనారాయణ రావు, కేశవులు, జిల్లా కార్యదర్శులు ఎం.శ్రీనివాస్ రెడ్డి, కె.విజయలక్ష్మి, చినవెంకన్న, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.