Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేగులు తెగేదాకా కేంద్రంపై పోరాటం చేస్తాం
- మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
- హాజరు కాని ప్రతిపక్ష నాయకులు
నవతెలంగాణ-నల్లగొండ
ఆహార భద్రత చట్టం ప్రకారం రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని కోరుతూ జిల్లాలోని అన్ని మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధాన్యాన్ని కొనమని చెప్పే అధికారం, హక్కు కేంద్రానికి లేదన్నారు. పీయూష్ గోయల్ పెట్టుబడి దారుల ప్రతినిధిగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తెలంగాణ రైతులను అవమానించేలా మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ వ్యక్తులకు కొమ్ము కాస్తున్నదని ఆయన విమర్శించారు. యసంగి వడ్లని కొనాలి అని నల్లగొండ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ముక్తకంఠంతో తీర్మానం చేసిందని తెలిపారు. రైతుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో ఎంతకైనా కొట్లాడుతా మని మంత్రి తెలిపారు. పేగులు తెగేదాక పోరాటం చేసి కేంద్రం దిగి వచ్చేదాకా ఉద్యమిస్తామని చెప్పారు. కాగా అత్యవసర సమావేశానికి ప్రతి పక్ష ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరూ హాజరుకాలేదు. జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన అత్యవసర సర్వసభ్య సమావేశంలో రైతు పండించిన ప్రతి గింజను కేంద్రమే కొనుగోలు చేయాలని సమావేశంలో చైర్మన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా వైస్ చైర్మన్ ఈరిగి పెద్దులు, తిప్పర్తి జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి ఆమోదించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య, జెడ్పీ సీఈవో వీరబ్రహ్మచారి, డిప్యూటీ సీఈవో కాంతమ్మ, వివిధ మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు.