Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల
నవతెలంగాణ-తిరుమలగిరి
తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన అంతమొందించడానికి ప్రజలు చైతన్యమై రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పిలుపునిచ్చారు.ఆదివారం మున్సిపల్ పరిధిలోని నందాపురం నుండి ప్రారంభమైన ప్రజాప్రస్థానం పాదయాత్ర తిరుమలగిరి చేరుకున్న సందర్భంగా ఆమె ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబపాలన సాగుతోందని, ఈ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని కోరారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.కేసీఆర్ పచ్చి మోసగాడని, ఇంటికో ఉద్యోగమని, రూ.3 వేల నిరుద్యోగభృతి అని, డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని, బంగారు తెలంగాణ చేస్తానని బాధల తెలంగాణ చేసి మాయమాటలు చెప్పి ప్రజలను మోసంచేశాడని ఆరోపించారు.కేంద్రంలోని బీజేపీ పెట్రోల్,డీజిల్, గ్యాస్ధరలు పెంచితే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం బస్సు, విద్యుత్ చార్జీలు పెంచుతున్నాడని, ఇద్దరు దొంగలేనని ఎద్దేవా చేశారు.తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలను కొనలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఈ చేతగాని ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.. తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. అంతకుముందు తెలంగాణ చౌరస్తాలో ఫూలే, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న, నాయకులు నాయ కులు గిలకత్తుల రమేశ్, పలువురు పాల్గొన్నారు.