Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీటీిఎఫ్ వార్షిక కౌన్సిల్ లో రాష్ట్ర కార్యదర్శి భాస్కర్
నవతెలంగాణ-నల్లగొండ
పాఠశాలలకు భౌతిక వనరుల కన్నా ముందు ఉపాధ్యాయుల నియామకాలు జరగాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.భాస్కర్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల( బాలురు) లో జరిగిన డీటీఎఫ్ జిల్లా వార్షిక కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. మన ఊరు- మన బడి పథకం కింద సుమారు 7వేల కోట్లతో పాఠశాలల భౌతిక వసతుల కల్పనకు ప్రభుత్వం ముందుకు రావడం ఆహ్వానించదగ్గదే అయినా గత 7 సంవత్సరాలుగా, ఉపాధ్యాయ పోస్టులు నింపక పోవడం, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించకపోవడం వల్ల పాఠశాలల్లో సబ్జెక్ట్ ఉపాధ్యాయుల కొరత ఏర్పడిందని, దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల డీఎస్సీ ద్వారా పదోన్నతులు కల్పించి, నియామకాలు జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం . సోమయ్య మాట్లాడుతూ రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు తీసుకువచ్చిన 317 జీఓ ద్వారా ఉత్పన్నమైన ఉపాధ్యాయుల సమస్యలను, మ్యూచువల్ బదిలీలను వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు. ప్రతి నెలా ఒకటవ తేదీన వేతనాలు చెల్లించాలని, వేసవిలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు ఎం.డి. ఖురిడ్మియా అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి పి.వెంకులు, జిల్లా కమిటీ బాధ్యులు నాగేంద్ర, వెంకటేశం, వెంకటేశ్వర్లు, నాగయ్య, అంజయ్య, ఏడుకొండలు, వీరాసారెడ్డి, భిక్షమయ్య, వీరయ్యలతో పాటు కట్టంగూర్ ఇ .జగత, తిప్పర్తి వెంకన్న, అనుముల పుష్ఫ, సైదులు, సుక్తకాల్, యాగుభ, డిటిఎఫ్ భువనగిరి జిల్లా అధ్యక్షులు ఎం.సత్తయ్య, లక్ష్మయ్య, గుర్రంలోడ్ సూర్యాపేట డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్.లింగయ్య పాల్గొన్నారు.