Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవూర/ మునుగోడు
భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దవూర మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ పరమేష్ తెలిపిన వివారాల ప్రకారం నల్గొండ మండలం కాకుల కొండారం గ్రామానికి చెందిన పల్లవి (27) ను, మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన ఐయితగోని శేఖర్‌తో 11 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు కూడా ఉన్నారు. అయితే పెళ్లి అయిన కొంత కాలం నుంచి శేఖర్ వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టు కున్నాడు. అప్పటి నుంచి భార్య పల్లవిని అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో ఆమె కొంత కాలంగా మానసిక వేదనతో అనారోగ్యానికి గురైంది. ఈనెల 16న ఇంటి నుంచి వెళ్లి పెద్దవూర మండలం సమ్మక్క ,సారక్క ఆలయం సమీపంలో పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో పడి పోయింది. అక్కడి స్థానికులు గమనించి ఆమెను నాగార్జున సాగర్ కమలా నెహ్రూ ఆసుపత్రికి తరలించారు. ప్రథóమ చికిత్స జరిపి ఆమెను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతు రాలి తండ్రి ఊశయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
శేఖర్ వేధింపులకు 2009 లో యువతి , నేడు భార్య బలి
మండలంలోని కొరటికల్ గ్రామానికి చెందిన అయితగొని శేఖర్ 2009లో అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోమని లేదంటే యాసిడ్ పోసి చంపుతానని వేధింపులకు గురి చేయడంతో మనస్థాపానికి గురైన యువతి పురుగుల మందు తాగి మృతి చెందింది. ఆ కేసులో శేఖర్ జైలు జీవితాన్ని కూడా గడిపాడు. బెయిల్ పై వచ్చిన శేఖర్ అంతటితో ఆగకుండా పత్తి వ్యాపారం చేసుకుంటూ అదే సమయంలో పరిచయమైన నల్లగొండ మండలం కాకుల కొండారం గ్రామానికి చెందిన పల్లవిని ఇరు కుటుంబాల ఒప్పందంతో 11 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. పల్లవికి ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నప్పటికీ మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం తెలుసుకున్న భార్యను వేధింపులకు గురి చేయడంతో మనస్థాపానికి గురైన పల్లవి ఇటీవల పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించగా ప్రాణంతో బయట పడింది. అయినా భర్త తీరు మారక పోవడంతో తమ పిల్లల జీవితం ఆగమవుతుందని తీవ్ర మనస్థాపానికి గురై శనివారం పెద్దవూర మండలం సమ్మక్క సారక్క దేవాలయం వద్ద మళ్లీ పురుగుల మందు తాగింది. అది గమనించిన స్థానికులు మెరుగైన వైద్యం కోసం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. ఇద్దరి ఆత్మహత్యకు కారకుడైన శేకర్పై పూర్తిస్థాయి విచారణ జరిపి నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.