Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దొరికినకాడికి హద్దులు పెడుతున్న కబ్జాదారులు
- చోద్యం చూస్తున్న అధికారులు
నవతెలంగాణ-నిడమనూరు
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోజురోజుకు భూమి విలువ పెరుగుతుంది. గతంలో పట్టణాలు, సిటీలో మాత్రమే భారీగా విలువ ఉన్న భూములకు రియల్ ఎస్టేట్ పుణ్యమాని గ్రామాల్లో సైతం భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అదే కబ్జాదారులకు వరంగా మారింది. ప్రభుత్వ భూములు ఎక్కడ కనిపిస్తే అక్కడ కొంతమంది ఆక్రమణలకు తెర లేపుతూ అందినకాడికి అక్రమించుంకుంటున్నారు. మండలంలోని ముప్పారం గ్రామంలో సైతం ప్రభుత్వ భూమిని ఎవరికి దగ్గట్టు వారు ఆక్రమించుకుంటూ దొరికిన కాడికి హద్దులు పెడుతున్నారు. సర్వే నెంబర్ 378 లో 2 ఎకరాల 8 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. అయితే అందులో 2019లో 1.8 గుంటల ప్రభుత్వ భూమిని గ్రామంలో ఇండ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇండ్ల పట్టాలను మంజూరు చేసింది. ఇందులో ఎవరు ఇండ్లు నిర్మించుకోకపోవడంతో అధికారులు పట్టాలను రద్దు చేసి డబుల్ బెడ్ రూం ఇండ్ల ఏర్పాటుకు అవసరమైన భుమిగా స్వాధీనం చేసుకున్నారు. అయినా గ్రామంలో ఎవరికి అందినకాడికి వారు హద్దు రాళ్ళు ఏర్పాటు చేసుకొని ఆక్రమణకు గురిచేస్తున్నారు. తాజాగా ఆదివారం గ్రామంలో కొంతమంది ఖాళీ స్థలాన్ని ఆక్రమించుంకునేందుకు రాళ్ళు ఏర్పాటు చేస్తుండగా గతంలో ఆక్రమించుకున్న వాళ్లు అక్కడకు చేరుకొని ఆ భూమి మాదంటే మాదని ఘర్షణకు దిగారు. ఎవరికి నచ్చిన భూమిని వారు అక్రమిస్తుండడంతో ప్రభుత్వ భూమి పూర్తిగా అన్యాక్రాంతం అయ్యే అవకాశం నెలకొంది. అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు చోద్యం చూస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఆక్రమించుకొని అందులో ఇండ్ల నిర్మాణాలు సైతం ప్రారంభించడంతో మరికొంతమంది ఆక్రమించుకున్న భూమిని అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించిం ప్రభుత్వ భూమిని కాపాడాలని పలువురు కోరుతున్నారు.