Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్లాట్ కబ్జా చేసి రాత్రికి రాత్రే సీసీ రోడ్డు,పోయించాడని ఆరోపిస్తున్న బాధిత మహిళ
- పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు
- తనకు ప్రాణహాని ఉంది కాపాడాలని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన మహిళ
నవతెలంగాణ- సూర్యాపేటకలెక్టరేట్
తమ సొంత ప్లాట్‌ను కబ్జా చేసిన అధికార పార్టీకి చెందిన నాయకుడిని ఇదేంటని అడిగి నందుకు ఒక మహిళనని కూడా చూడకుండా అసభ్యంగా దూషిస్తూ దిక్కున్నచోట చెప్పుకో అంటూ బెదిరిస్తూ, ప్లాట్ కోసం వస్తే కాళ్ళు చేతులు నరికేస్తానని భయ బ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆదివారం సోషల్ మీడియాలో ఓ మహిళ పెట్టిన వీడియో ఇప్పుడు జిల్లాలో వైరల్‌గా మారింది.ఆ వీడియోలో ఆమె చెప్పిన మాటల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మోతె మండలం రావిపహాడ్ గ్రామానికి చెందిన బి.పద్మశ్రీ కుటుంబం కొంత కాలంగా పిల్లల చదువుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఉంటుంది.ఆమెకు జిల్లాకేంద్రంలోని కుడకుడరోడ్లో 10 గుంటల సొంత స్థలం ఉండగా, కుటుంబ అవసరాల నిమిత్తం గతంలో 5 గుంటలు విక్రయించారు.ఆ 5 గుంటల్లో కూడా ఈ మధ్య కాలంలో మూడొంతుల స్థలం విక్రయించగా మిగిలిన 145 గజాల స్థలాన్ని పిల్లల భవిష్యత్ దష్ట్యా ఉంచుకుని దాని చుట్టూ ప్రహరీ నిర్మించుకొని గుంటూరుకు వెళ్లిపోయారు.తమ ప్లాట్‌ను జిల్లా కేంద్రానికి చెందిన అధికార పార్టీ నేత డా.భారు మరికొందరు మంత్రి పేరు చెప్పుకుంటూ కబ్జా చేసి, ఆ స్థలంలో ఉన్న గోడను ధ్వంసం చేసి, మున్సిపాల్టీ నిధులతో రాత్రికి రాత్రే సిమెంట్ రోడ్డు పోయించారు.విషయం తెలుసుకున్న తాము సూర్యాపేటకు వచ్చి స్థానిక పోలీసులకు, మున్సిపాల్టీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ తమ గోడును పట్టించుకోవడం లేదని వాపోయింది.వైశ్య కుటుంబానికి చెందిన తాము పిల్లల చదువుల కోసం గుంటూరులో ఉంటున్నామని,దాన్ని ఆసరాగా చేసుకొని సుమారు రూ.1.5 కోట్ల విలువ గల తమ ప్లాటును దౌర్జన్యంగా అక్రమించారని, ఇదేంటని అడిగితే కాలనీకి చెందిన కొంత మంది మహిళలను తమపైకి పురమాయించి కొట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని, మళ్ళీ ప్లాట్ అంటూ గుంటూరు నుంచి సూర్యాపేటలో అడుగు పెడితే చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.గతంలో తమ స్థలంలో విద్యుత్ స్తంభాలు వేస్తే హైకోర్టును ఆశ్రయించి ఆ పోల్స్‌ను తొలిగించేలా చేశామని,ఇప్పుడు డా.భారు అతని అనుచరులు నుండి తమకు ప్రాణ హాని ఉందని, తమ ప్లాట్ కు సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తమకు న్యాయం దొరకడం లేదని వాపోయింది. ఇప్పటికైనా జిల్లా మంత్రి, జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు స్పందించి స్థల పరిశీలన, సమగ్ర విచారణ జరిపి,తమ పరిస్థితిని అర్థం చేసుకొని తమ ప్లాటును తమకు ఇప్పించి న్యాయం చేయాలని వేడుకుంటుంది.