Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దామరచర్ల
మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం మరో 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో ఇద్దరు విద్యార్ధినిలను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. శనివారం అస్వస్థతకు గురైన 25 మందిలో 20 మంది విద్యార్థినిలు కోలుకొని వెళ్లిపోయారు. నాణ్యత లోపించిన ఆహార పదార్థాల కారణంగానే విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. బియ్యం నాసిరకంగా ఉన్నట్లు విద్యార్థినులు తెలిపారు. కూరగాయలు కూడా నాసిరకంవి వినియోగిస్తున్నట్లు తెలిసింది. సరైన పర్యవేక్షణ లేకపోవడం వలనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు విమర్శలు వస్తున్నాయి.
ఫుడ్ పాయిజన్‌కు కారకులపై చర్య తీసుకోవాలని ధర్నా
విద్యార్థినుల అస్వస్థతకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దామరచర్ల మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాల ఎదుట ఆదివారం బిసి, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సంఘాల వారు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడీ జీడయ్య యాదవ్, మాల మహానాడు విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ళపల్లి సురేష్ మాట్లాడుతూ విద్యార్థులు తమ సమస్యలను ప్రిన్సిపాల్‌కి, ఆర్సీఓకి విన్నవించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినట్లు చెప్పారు. పైగా విద్యార్థులను టార్గెట్ చేస్తూ వచ్చినట్లు చెప్పారు. విద్యా సంస్థలో ముఖ్యంగా టాయిలెట్స్‌ను శుభ్రం చేయించడం లేదని చెప్పారు. స్వీపర్లతో క్లీన్ చేయించాల్సిన తరగతి గదులను విద్యార్థులతో చేయిస్తున్నట్లు ఆరోపించారు. విద్యార్థుల సొంత డబ్బుతో చీపుర్లు కొనుగోలు చేసి వారితోనే శుభ్రం చేయించడం దారుణమన్నారు. అన్నంలో పురుగులు, రాలు, దారాలు వస్తుండడం, కూరలు నీళ్ళు కలిపి చేయడంతో ఫుడ్ పాయిజన్ అయ్యిందని తెలిపారు. నిర్లక్ష్యం చేస్తున్న ప్రిన్సిపాల్‌ని, ఇతర అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ నాయుడు, ఎంఆర్పిఎస్ మండల నాయకులు వసంత్ కుమార్, బీజేపీ నేతలు జానకి రెడ్డి, భీష్మరెడ్డి, తల్లి తండ్రులు అశోక్, రాజు, శ్రీను, వెంకటేశ్వర్లు, సుజాత, మంగ, నాగ, లీల, లత సునీత తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలను పరిశీలించిన అధికారులు
తహసిల్దార్ రాజు, ఎస్ఐ రవికుమార్ దామరచర్ల గురుకుల పాఠశాలను ఆదివారం సందర్శించారు. అస్వస్థతకు గురికావడానికి గల కారణాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
పరామర్శించిన సిద్ధార్థ
దామరచర్ల మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్థులు వాంతులు, విరోచనాల బారినపడి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని దామరచర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్థ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం సందర్శించారు. వైద్య సేవలు పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవాలందించాలని వైద్యులను సూచించారు.
బీఎల్ఆర్ పరామర్శ
కలుషిత ఆహారంతిని అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థినులను దామరచర్ల ప్రభుత్వ వైద్యశాలలో బత్తుల లక్మారెడ్డి పరామర్శించారు. ఆయన వెంట సర్పంచ్ కిరణ్ తదితరులు ఉన్నారు.