Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డున పడ్డ 15 కార్మిక కుటుంబాలు
- రైతులపై పెరగనున్న భారం
నవతెలంగాణ-భువనగిరిరూరల్
నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ (నార్ముల్) పశు ఆహార మిశ్రమ కర్మాగారాన్ని నష్టాల పేరుతో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మూతపడింది. దీంతో అందులో పని చేస్తున్న 15 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డుపడ్డాయి.
దాణా కర్మాగారం నేపథ్యం...
పాల ఉత్పత్తిదారులకు నాణ్యమైన పశుదాణా అందించేందుకు 1966లో భువనగిరి జిల్లా కేంద్రంలో నార్ముల్ సొంతంగా కర్మాగారాన్ని నెలకొల్పింది. నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్‌లోని రైతులకు దాణా అందించి గేదెలు, అవుల పాల ఉత్పత్తిని పెంచేందుకు ఈ కర్మాగారాన్ని స్థాపించారు.గతంలో ఈ కర్మాగారం నుంచి జీవీకే పెట్రోకెమికల్స్, యాదాద్రి గోశాల, హైదరాబాద్‌లోని జంతుప్రదర్శనశాల, చిలుకూరులోని మృగవాణి జింకల పార్క్, వనస్థలిపురంలోని పార్క్, వికారాబాద్‌లోని గుడుంబా పునరావాసం బాధితుల పాడి పశువులకు ప్రతినెలా సరఫరా జరిగేది.బహిరంగ మార్కెట్లో కన్నా తక్కువధరకు నాణ్యమైన దాణా లభిస్తుండడంతో ఎక్కువమంది కొనుగోలుకు ఆసక్తి చూపి కొనుగోలు చేసేవారు.మొదట్లో నెలకు 300 టన్నుల దాణా తయారు చేశారు.ఇటీవల కాలంలో నిర్వహణ భారం నష్టాలతో తయారీ తగ్గినట్టు యాజమాన్యం, సంబంధిత నిర్వాహకులు చెబుతున్నారు.
పాల ఉత్పత్తి తగ్గడంతో ఇటీవల నెలకు 120 టన్నుల తయారు చేసినట్లు ఈనెల 5వ తేదీ నుంచి పూర్తిగా ఆపేసినట్టు సమాచారం. నష్టాలను సాకుగా చూపి కమీషన్లకు కక్కుర్తిపడి యాజమాన్యం సరఫరా బాధ్యతను గుంటూరు జిల్లా నర్సారావుపేటలోని వల్లభ సీడ్స్‌కు అప్పగించిందన్న ఆరోపణలు ఉన్నాయి.కాగా ఈ నిర్ణయం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కర్మాగారం ఆధ్వర్యంలో 50 కిలోల బస్తా రూ.800 లభించే దాణా బస్తా, ప్రయివేట్‌కు వెళ్తే అదనపు భారం పెరిగి రైతులకు ఇబ్బంది కలుగుతుందని, నాణ్యమైన దాణా సరఫరా జరుగదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వీధినపడ్డ 12 మంది కార్మికులు...
నార్ముల్ దాణా కర్మాగారంలో పని చేసే 12 మంది కార్మికులు వీధిన పడ్డారు.ఏండ్ల తరబడిగా పనిచేస్తున్న కార్మికులు కర్మాగారాన్ని మూసివేయడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వెంటనే మళ్ళీ ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
క్వింటాల్‌కు రూ. 360 నష్టం వస్తుంది
నార్ముల్ ఎండి-అశోక్‌కుమార్
ఒక క్వింటాల్ దాణా తయారుకావడానికి రూ.1960 రూపాయలు ఖర్చవుతుందని, ప్రస్తుతం దాణా క్వింటాకు రూ.1600 అందజేస్తున్నాం.50 కిలోల బస్తాకు 8 వందల రూపాయలకు గాను రైతులకు ఒక బస్తాకు రూ.180 నష్టాన్ని యూనియన్ భరిస్తుంది.క్వింటా దాణాకు రూ.360 నష్టం వస్తుంది.కర్మాగారంలో మిషనరీ సుమారు 40 నుంచి 50 ఏండ్లపైబడి ఉంది.మరమ్మతులు చేసేందుకు కొంత ఆలస్యమవుతుంది.దీంతో రైతులకు దాణా అందించేందుకు తాత్కాలింగా గుంటూరు జిల్లా నర్సారావుపేటలోని వల్లభసీడ్స్కు అప్పగించాం.
14 ఏండ్లుగా పని చేస్తున్నా
ఎడ్ల మల్లేష్-కార్మికుడు
నార్ముల్ పశుదాణా కర్మాగారంలో తన తండ్రి ఏండ్లకు పైగా పని చేశాడు.తాను కూడా 14 ఏండ్లుగా దాణా కర్మాగారంలో పని చేస్తున్నా. కర్మాగారం మూసి వేయ డంతో నా కుటుంబం రోడ్డున పడింది.వెంటనే ప్రభుత్వం, యజమాన్యం స్పందించి వెంటనే దాణా కర్మాగారాన్ని ప్రారంభించాలి.