Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
సమయపాలన పాటించని అధికారులపై గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభ నుండి వెళ్లిపోయారు. మండలంలోని వివిధ శాఖల అధికారులు సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవని ఎంపీపీ పల్లె కళ్యాణి అన్నారు. గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ పల్లె కళ్యాణి అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి పలు శాఖల అధికారులు పూర్తి సమాచారంతో ఎందుకు హాజరు కావడం లేదని ఆమె ప్రశ్నించారు. అధికారులు గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని ఆమె ఆదేశించారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు యథేచ్ఛగా నడుస్తున్నాయని, నిర్వాహకులపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు ఎందుకు చేపట్టడం లేదని గట్టుప్పల్ సర్పంచ్ రోజా ప్రశ్నించారు. గట్టుప్పల్ పుట్టపాక గ్రామాల మధ్యన చేపడుతున్న క్రాంతి ఫార్మా కంపెనీకి అనుమతులు రద్దు చేయాలని వైస్ ఎంపీపీ మందడి నరసింహారెడ్డి తీర్మానం ప్రవేశపెట్టడంతో సభ్యులు ఆమోదించారు. సమావేశంలో వైస్ ఎంపీపీ మందడి నరసింహారెడ్డి, ఎంపీడీవో యాకూబ్ నాయక్, సర్పంచులు , ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
సమావేశాన్ని బహిష్కరించిన ఎంపీటీసీలు
సమావేశానికి ఏడుగురు ఎంపీటీసీలు హాజరయ్యారు. కానీ సమావేశం ప్రారంభమైనప్పటికీ కొంతమంది అధికారులు మాత్రమే హాజరు కాక పోవడాన్ని నిరసిస్తూ ఎంపీటీసీలు బయటకు వెళ్లి పోయారు. గొరిగి సత్తయ్య, చేపూరి యాదయ్య, నాతల వనజ, కావాలి మంగమ్మ, అవ్వారి గీత, తిప్పర్తి లక్ష్మమ్మ పాల్గొన్నారు.