Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
నవతెలంగాణ-నల్లగొండ
క్షేత్రస్థాయిలో శానిటేషన్, డంపింగ్ యార్డులు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలను గ్రామ కార్యదర్శులు, మండలస్థాయి అధికారులు పర్యవేక్షించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుండి ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గుడ్ గవర్నెన్స్, వాటర్ షెడ్స్, వైకుంఠధామాల పురోగతి, లేబర్ మొబిలైజేషన్, నర్సరీల పురోగతి, మెటీరియల్ బిల్లుల చెల్లింపులపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడ్ గవర్నెన్స్ పనుల పరిశీలనకు కేంద్ర కమిటీ వచ్చే అవకాశం ఉందని, వారు వచ్చినప్పుడు వారికి అర్థమయ్యే విధంగా పేర్ల బోర్డులను ఏర్పాటు చేయాలని కోరారు. రిజిష్టర్ల నిర్వహణ సక్రమంగా చేపట్టాలన్నారు. సీఆర్ రికార్డులను పూర్తిచేసి ఈఈకి పంపాలన్నారు. వాటర్ షెడ్స్ కొరకు అటవీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో చర్చించాలన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై మండలాల వారీగా సమీక్షించారు. పనులను కల్పించడానికి అనువైన ప్రాంతాలను గుర్తించి నూటికి నూరు శాతం అమలు చేయాలన్నారు. శ్మశాన వాటికల పనుల పురోగతిపై సమీక్షిం చారు. ఈ నెల 20వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నర్సరీలలో విత్తనాలు నాటడానికి బ్యాగులను సిద్ధం చేయాలని, జనశక్తి అభియాన్ కార్యక్రమం కింద 213 పనులు జరిగాయని, వాటికి సంబంధించిన ఫొటోలు అప్ లోడ్ చేయాలని ఆయన తెలిపారు. జీఐఎస్, బేస్డ్ ప్లాన్ పనులు వేగవంతం చేయాలని సూచించారు. అమృత్ సరోవర్ కింద 99 పనులు వచ్చాయని, వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ పూర్తి చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా పరిషత్ సీఈఓ వీర బ్రహ్మచారి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్థన్, డీఅర్డీఓ కాళిందిని పాల్గొన్నారు.