Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య
నవతెలంగాణ -భువనగిరి రూరల్
ప్రజల హక్కులను కాపాడడం, వారి అవసరాలను తీర్చడంలో అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ జి.చంద్రయ్య సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జిల్లా అధికారులతో అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, మానవ హక్కుల పరిరక్షణ అవగాహనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు తమ శాఖల ద్వారా ప్రజలకు అందించే అభివద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలును వివరించారు. ఈ సందర్భంగా చైర్మెన్ మాట్లాడుతూ ఏ మనిషి సమస్యతో 'మీ' వద్దకు వస్తారో ఆ సమస్య తనకే వస్తే ఎలాంటి పరిస్థితి వుంటుందో ఆలోచించి వారికి న్యాయం కలిగేలా చేయాలన్నారు. చిత్తశుద్ది, ఆలోచనా శక్తి, గుండె ధైర్యంతో విధులు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. ప్రజలు, అధికారులకు హక్కులు, చట్టపరమైన అంశాల తారతమ్యంపై అవగాహన కలుగడానికి తమకు తాముగా, అలాగే స్వచ్చంద సంస్థల సమన్వయంతో సభలు, సమావేశాలు నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిలలో ప్రభుత్వ పరంగా నిర్వహించే పథకాలు అమలును పరిశీలిస్తామన్నారు. సంక్షేమ పథకాలు మానవ హక్కులకు సంబంధించినవని, ప్రతి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందాలన్నారు. కలుషిత వాతావరణం ప్రాణానికి హానికరమని భావించినప్పుడు దానిపైన విచారణ చేపట్టి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చే అధికారం కమిషన్కు ఉందన్నారు. భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తికి సమాన హక్కులను కల్పించిందన్నారు. అధికారులు రాజ్యాంగాన్ని, మానవ హక్కులను తప్పనిసరిగా చదవాలని అధికారులకు సూచించారు. సిజేరియన్ ఆపరేషన్ల విషయం మాట్లాడుతూ భయం, ఓపిక లేకపోవడం, సులభంగా డెలివరీ అవుతుందని, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, డాక్టర్లు కూడా అవగాహన కలిగించకపోవడం వల్ల ప్రయివేటు ఆసుపత్రులలో 90 శాతం సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయన్నారు.జిల్లాకు సంబంధించిన పది కేసుల పురోగతిని సంబంధిత అధికారులతో పరిశీలించారు. యాదగిరిపల్లి గ్రామంలో కల్లుగీత సొసైటీ, గ్రామవాసి నర్సింగ్ గౌడ్ కేసుకు సంబంధించి ఉభయులతో చర్చించి పరిష్కారం చేపట్టాలని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ను చైర్మెన్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు తమ శాఖల ద్వారా జరిగే కార్యకలాపాలను వివరించారు. జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టరు డి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, అధికారులు తమ పనితీరును ఇంకా మెరుగుపరచుకొని ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలన్నారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు మాట్లాడుతూ, ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులువు అయిందన్నారు . ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు నారాయణరెడ్డి, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.