Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
- యూఎస్పీసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ- నల్లగొండ
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ను వెంటనే విడుదల చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట యూఎస్ పీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు ఆయన హాజరై మాట్లాడారు. నాలుగేండ్లుగా బదిలీలు, ఏడేండ్లుగా పదోన్నతులు, పదిహేనేండ్లుగా పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ కాక విద్యాశాఖ తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు పీఓ 2018 ప్రకారం బదిలీలు పదోన్నతులకు ఆటంకాలు తొలగిపోయాయన్నారు. విద్యాశాఖలో నెలకొన్న సంక్షోభం పరిష్కారానికి మార్గం సుగమమైందన్నారు. సీఎం కేసీఆర్ మార్చి10న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని ప్రకటించారన్నారు. దాని ప్రకారం వెంటనే బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ ప్రకటించాలని కోరారు.
ప్రభుత్వ బడుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మన ఊరు-బస్తీ -మనబడి విజయవంతం కావాలంటే పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండాలని దానికనుగుణంగా ప్రమోషన్లు బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వేసవి సెలవులు ప్రారంభమై మూడు వారాలు గడిచినప్పటికీ షెడ్యూల్ విడుదల చేయకుండా విద్యాశాఖ అధికారులు తాత్సారం చేస్తున్నారన్నారు. జీవో 315 ద్వారా చేపట్టిన ఉద్యోగాల కారణంగా నష్టపోయిన ఉపాధ్యాయులు పరిష్కారం చేయడంలో తాత్సారం జరుగుతుందన్నారు. జీవో 317 అమలు కారణంగా ఏర్పడిన సీనియారిటీ స్పెషల్ కేటగిరి భార్య భర్తల సమస్యల పై పెండింగ్లో ఉన్న అప్పీలు వెంటనే పరిష్కరించాలని, ప్రతినెల 1న వేతనాలు విడుదల చేయాలని, సప్లమెంటరీ బిల్లులు జాప్యం లేకుండా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూపీఎస్ నాయకులు యడ్ల సైదులు, పీ వెంకులు, రామకష్ణ, రత్తయ్య రత్తయ్య, ఖుర్శింద్ మీయా, షాహీన్ తయ్యబ్, పెరుమాళ్ళ వెంకటేశం, నంద్యాల రాజశేఖర్ రెడ్డి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, నాగమణి, బక్క శ్రీనివాసాచారి, సరళ, నర్రా శేఖర్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు మురళయ్యా,అరుణ, విజయ లక్ష్మి, రమాదేవి, నరసింహ, రాజు, వెంకన్న, నాగిరెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.