Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్
నవతెలంగాణ-నల్లగొండ
వాతావరణ పరిస్థితులు మారుతున్నందున ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి వచ్చే పది రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో పౌర సరపరాల,జిల్లా గ్రామీణాభివద్ధి, సహకార, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు,మిల్లర్లతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు,కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొనుగోళ్లలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటి వరకు 248 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా అందులో ఐకేపీ ద్వారా 128 కేంద్రాలు, పీఏసీఎస్ ద్వారా 112 , కేంద్రాలు, మార్కెటింగ్ ద్వారా 8 కేంద్రాలు ప్రారంభించి 2 లక్షలా 35 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం 37467 మంది రైతుల నుండి కొనుగోలు చేసినట్టు తెలిపారు. రూ.210 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. ఇంకా 80 వేల మెట్రిక్ టన్నుల నుండి లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం ఉన్నట్టు సమాచారం ఉందన్నారు. రోజుకు 10 వేల మెట్రిక్ టన్నుల చొప్పున 10 రోజుల్లో ఆయా కొనుగోలు కేంద్రాల ద్వారాపూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. యాసంగి 2020-21 సంవత్సరానికి సంబంధించి మిల్లర్లు 5,78,732 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లింగ్ చేసి బియ్యం సరఫరా చేయాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 5,57,032 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లింగ్ చేసి బియ్యం సరఫరా చేశారని తెలిపారు. మే 31 లోగా పెండింగ్ ఉన్న 21,700 మెట్రిక్ టన్నుల సి.ఎం.ఆర్ పూర్తి చేయాలని మిల్లర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,పౌర సరఫరాల డీఎం నాగేశ్వరరావు, డీసీఓ ప్రసాద్, మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్, సహాయ పౌర సరపరాల అధికారి నిత్యానందం, వ్యవసాయ శాఖ ఏడీ హుస్సేన్ బాబు, ఐకేపీఏపీడీ అరుణ్, మిల్లర్ల సంఘం అధ్యక్షులు యాద గిరి, కార్య దర్శి భద్రాద్రి, గౌరవాధ్యక్షుడు మహేందర్ ,తాలూకా అధ్యక్షులు నారాయణ, వెంకన్న,హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.