Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగంగా జరుగుతుందని అదికారులు చెపుతున్నారు. కానీ ధాన్యం రాసులు మార్కెట్ కేంద్రాలలో కుప్పలు తెప్పలుగా పడిఉన్నాయి. వానకాలం నెత్తిమీదికి వచ్చేస్తుంది. మే చివరి వారంలో కూడా వర్షాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఒకవేళ అనుకోకుండా వరుణ దేవుడు పరుగెత్తుకుంటూ వస్తే రైతుల ధాన్యం అంతా వర్షం నీటి పాలవ్వడం ఖాయం..అధికారులు ఇప్పటికైనా వేగంగా చేయకపోతే తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉండే అవకాశం ఉంది. సూర్యాపేట జిల్లాలో 2.20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయగా ఇప్పటివరకు 1.56లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పటివకే హూజుర్నగర్, కోదాడ ప్రాంతాలలో దాదాపు కొనుగోళ్లు పూర్తిచేసినట్టు అధికారులు చెపుతున్నారు. అయితే తుంగతుర్తి, సూర్యపేట ప్రాంతాలలో అయితే కేవలం 40శాతం మాత్రమే కొనుగోలు చేశామని, ఇంకా 60శాతం ధాన్యం మార్కెట్లలోనే ఉంది. నల్లగొండ జిల్లాలో 3.70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటివరకు 2.25లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. యాదాద్రి జిల్లాలో 3.14లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేయగా దాదాపు ఇప్పటి వరకు 70వేలకుపైగా మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
దేశానికి అన్నంపెట్టే రైతన్న తాను పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్ వస్తే పిల్చీ పిప్పిచేస్తున్నారు. వాస్తవంగా ఒక బస్తా ధాన్యం తూకంపై అరకిలో వేయాల్సిన హామాలీలు ఒక కిలో నుంచి మూడు కిలోల వరకు అదనంగా దాన్యం తూకం వేస్తున్నారు. ఆ పద్దతిలో ఒకలారీకి 2-3 క్వింటాళ్ల వరకు అదనంగా ధాన్యం తూకం వేస్తున్నారు. చిన్న కేంద్రం నుంచి రోజుకు 10 నుంచి 12లారీల ధాన్యం ఎగుమతి చేస్తుంటారు. మిర్యాలగూడ, సూర్యపేట, తిరుమలగిరి, దేవరకొండ , భువనగిరి లాంటి మార్కెట్లలో రోజుకు 25 నుంచి 30లారీల ధాన్యం ఎగుమతి చేస్తున్నారు. ఒకలారీకి 2నుంచి 3క్వింటాళ్ల వరకు అధికంగా తూకం వేసిన ధాన్యాని సుమారు రూ.6వేల అదనంగా ఆదాయం వస్తుంది.ఈ లెక్కన లక్షల ఆదాయం అక్రమ మార్గాన కేంద్రం నిర్వహికులు, హామాలీలు సంపాదిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంతేగాకుండా రైతుల ధాన్యం తూకం వేయడానికి కూడ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒక ట్రాక్టర్ లోడ్ ధాన్యం ఉంటే రూ.200నుంచి 500వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. గుమాస్తా రుసుము, ఎలక్ట్రానిక్ కాంటా రుసుము, హామాలీ మాముళ్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనే రైతుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులు ఇస్తే వేగంగా ధాన్యం తూకం వేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ అక్రమ తూకాలపై గత సీజన్లో జిల్లాలో ఒకటి, రెండు కేసులు కూడ నమోదైతే అధికారులు ఫిర్యాదులను మచ్చిక చేసుకుని వాటిని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేశారు. ఈ తతంగం పూర్తిగా కేంద్రం నిర్వహిస్తున్న నిర్వహకులకు, హామాలీల కనుసన్నల్లోనే జరుగుతుందనే విషయం బహిరంగ రహస్యమే. ఈ విదానం ఇలాగే కొనసాగితే రైతులకు భవిష్యత్లో మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. ఇదే విషయంపై తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఏవోకు వినతి పత్రం అందజేశారు.
అక్రమ తూకాలపై క్షేత్రస్థాయి విచారణ చేయాలి
బండ శ్రీశైలం, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అక్రమతూకాలతో రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుంది. అంతేగాకుండా ముందస్తుగా తూకం వేస్తామనే పేరుతో హామాలీలు రైతుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. వీటిపై పూర్తిగా విచారణ చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్లో పురావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.