Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టాక్స్‌ను తగ్గించుకోవాలి
- మద్దతు ధర చట్టంపై కేంద్రంపై ఒత్తిడి తేవాలి
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించామని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు బారెడంత ధర పెంచి జానెడు తగ్గిస్తే లాభం ఏంటని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రశ్నించారు.సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఇప్పటివరకు పెట్రోల్‌పై రూ.49, డీజిల్‌పై రూ.55 పెంచిందని విమర్శించారు.కేవలం ఎనిమిది రూపాయలు తగ్గించి ఏదో ప్రజలకు న్యాయం చేసినట్టు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.పెట్రోల్‌పై ఉన్న వ్యాట్ టాక్స్‌ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించుకోవాలని డిమాండ్ చేశారు.నిత్యావసర ధరలు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, పేద ప్రజలు సామాన్యులు బతకలేని పరిస్థితిలో ఉన్నారని వాపోయారు.పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల దాని ప్రభావం అన్ని వస్తువులపై పడిందన్నారు.వెంటనే పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.పంటకు మద్దతు ధర కల్పించాలని జాతీయస్థాయిలో ఉద్యమాలు చేపట్టడంపై స్వాగతిస్తున్నామని కానీ అందర్ని కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు.అన్ని పార్టీల సహకారం తీసుకోవాలని సూచించారు.ఈ ఏడాది పాటు రైతు ఉద్యమం జరిగితే స్పందించని సీఎం కేసీఆర్ ఇప్పుడు చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది రైతులు చనిపోయారని వారికి కనీస ఎక్స్‌గ్రేషియా కూడా అందలేదని వాపోయారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.తాత్కాలిక పథకాలు తీసుకువచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయంగా లబ్ది పొందుతున్నాయని విమర్శించారు.శాశ్వత పథకాలు తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. అది కేవలం ఎర్రజెండాతోనే సాధ్యమవుతుందన్నారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి, రవినాయక్, పరుశరాములు, గాదె పద్మ, పతాని శ్రీనివాస్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.