Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్నలిస్టులపై పెట్టిన అక్రమకేసులు ఎత్తేయాలి
- కొత్త బస్టాండ్ వద్ద జరిగిన రాస్తారోకోలో జర్నలిస్టులు
- మద్దతు తెలిపిన సీపీఐ(ఎం)
నవతెలంగాన-సూర్యాపేట
జర్నలిస్టులను అసభ్య పదజాలంతో దూషించిన సబ్ రిజిస్టార్ బలరాంను వెంటనే అరెస్టు చేయాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి.ఇద్దరు పాత్రికేయులను దూషించడం కాకుండా వారిపై చెయ్యి చేసుకున్న ఘటనలో పోలీసులు అనుసరిస్తున్న తీరుకు నిరసనగా,సబ్ రిజిస్టార్ పై కేసు నమోదు చేసి, వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం స్థానిక కొత్త బస్టాండ్సెంటర్లో పాత్రికేయులు ధర్నాకు దిగారు.ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రజలకు, ప్రభుత్వాలకు తెలియజేస్తూ, సామాజిక స్పహతో అర్దాకలితో సేవ చేస్తున్న జర్నలిస్టులపై భౌతిక దాడులకు దిగుతున్న వారిని వదిలేసి,జర్నలిస్టులపై అక్రమ కేసుకు బనాయించడం ఏమిటని ప్రశ్నించారు.రాజకీయ పార్టీల నేతలు, అధికారులు,కాంట్రాక్టర్లు,అక్రమ మాఫియా దారులు,అందరూ జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వారికి పోలీసులు కొమ్ముకాస్తూ మరింత వేధిస్తున్నారని ఆరోపించారు.సమాజంలో జరిగే మంచితోపాటు, చెడును కూడా ప్రజలకు, ప్రభుత్వాలకు తెలిసేలా చేయడం పత్రికల,మీడియా బాధ్యతని,తమ బాధ్యతను తాము నిర్వర్తిస్తుంటే తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై రాజకీయ నేతల, అధికారుల,పోలీసుల తీరు మారకుంటే భవిషత్లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా యూనియన్లన కతీతంగా భారీ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి జర్నలిస్టులపై చెయ్యి చేసుకున్న సబ్ రిజిస్టార్ బలరాంపై కేసు నమోదు చేసి, వెంటనే అరెస్ట్ చేయాలని,పోలీసులు జర్నలిస్టులపై పెట్టిన అక్రమకేసులు ఎత్తేయాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టులపై సబ్రిజిష్టర్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ జర్నలిస్టులు నిర్వహించిన నిరసన,రాస్తారోకోకు సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కోటగోపి మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.