Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
నిలువ నీడలేని పేదలు పొద్దస్తమానం కష్టం చేసి తలదాచుకునేందుకు గజం స్థలం లేక సరైన ఇండ్లు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే పాలకవర్గాలు మాత్రం కనీసం పట్టించుకునే పరిస్థితి లేదని, ఇండ్ల స్థలాల కోసం, సాగుభూమి కోసం పెద్దఎత్తున పోరాటాలు సిద్ధం కావాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు పిలుపునిచ్చారు.బుధవారం మండలంలోని వెలిశాల గ్రామంలో 25 ఏండ్ల కింద పేదలకు ఇండ్లస్థలాల కోసం కొనుగోలు చేసిన 146 సర్వే నెంబర్లు 4:30 ఎకరాల ప్రభుత్వభూమికి నేటికీ పట్టా హక్కులు కనిపించలేదన్నారు.ఆ భూమిలో పేదల జెండా నాటి పోరాటం ప్రారంభించామన్నారు.జిల్లావ్యాప్తంగా నేటికీ 130 గ్రామాల్లో నాడు ప్రభుత్వం ఇండ్ల స్థలాల కోసం వేలాది ఎకరాలు కొనుగోలు చేసిన భూములు వృథాగా భూస్వాములు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఆక్రమించుకుని అనుభవిస్తున్నారని విమర్శించారు.ఆ భూములను పేదల కోసం కొనుగోలు చేశారని, ఆ భూములను పేదలంతా స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో ఇండ్లు, స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లవుతున్నా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.జిల్లావ్యాప్తంగా నేటి నుండి ఇండ్ల స్థలాల కోసం, సాగుభూమి కోసం పోరాటాలు నిర్వహిస్తామన్నారు.ప్రభుత్వ భూమిలో పేదలు గుడిసెలు వేసుకుంటే వెంటనే పట్టా హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు మిట్టపల్లి లక్ష్మి, సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు కడారిలింగయ్య, గ్రామకార్యదర్శి దూపటి రాములు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు సోమయ్య, పల్లె కొమురయ్య, చిత్తలూరిసోమయ్య, ఎల్లయ్య, లింగయ్య పాల్గొన్నారు.