Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేతో కలిసి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
నవతెలంగాణ-నల్లగొండ
జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి వార్డుల్లో సుమారు 4 గంటలు పాటు కలియతిరిగి ఆసు పత్రిలో మౌలిక వసతులు, రోగులకు అందుతున్న వైద్య సేవలు పరిశీలించారు. తొలుత కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి, మాతా శిశు ఆరోగ్య కేంద్రంను పరిశీలించి అవసరమైన మౌలిక సదుపా యాలపై చర్చించారు. ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్లు, స్టాఫ్ నర్సు ఎంతమంది పని చేస్తున్నారని, వారి విధుల గురించి వారు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య మిత్ర కౌంటర్ వద్ద రిజిష్టరులో ఎన్ని కేసులు నమోదు చేశారని స్వయంగా పరిశీలించారు. సిటీ స్కాను పరిశీలించి తెలుగు, ఇంగ్లీషులో నేమ్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు. పాత సిటీ స్కాను పరిశీలించి మరమ్మత్తులు చేసి ఉపయోగంలోకి తేవాలని ఆయన తెలిపారు. ఎక్స్ రే కొత్తది ఇన్స్టాల్ చేసి రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కొత్త రేడియాలజీ రూమ్‌ను పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణలో చెత్త చెదారం కనపడడంతో సంబంధిత కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత ఫైళ్లను బీరువాలలో భద్రపర్చాలని సూపరింటెండెంట్‌కు సూచించారు. నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు వైద్య సౌకర్యాలు చేరువ చేయాలనే ఉద్దేశంతో సర్కారు దవాఖానాలను అన్ని సౌకర్యాలతో మెడికల్ హబ్‌గా తయారు చేస్తున్నామని తెలిపారు. మన ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఎక్కువ సంఖ్యలో కాన్పులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మెడికల్ కళాశాలకు జూన్ 4వ తేదీన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేస్తారని ఆయన తెలిపారు. జిల్లా కేంద్ర వైద్య శాల మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఎక్సరే, రేడియాలజీ, ఫార్మసీ, జిల్లా కేంద్ర ల్యాబ్, డయాగస్టిక్ వార్డు, కొత్త డయాలసిస్ వార్డును పరిశీలించి తగు సూచనలు చేశారు. ఆసుపత్రి ఆవరణలో ఆహ్లాదంగా ఉండే విధంగా గ్రీనరీ ఏర్పాటు కోసం సూపరింటెండెంట్, మున్సిపల్ శాఖ సంయుక్తంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కేంద్ర వైద్యశాల సూపరింటెండెంట్ డా. లచ్చు, డా. అనిత, డా. ప్రశాంత్, డా. రజనీ, డా.యాదగిరి, అజీజ్, మున్సిపల్ కమిషనర్ డా. కేవీ.రమణాచారి, మున్సిపల్ వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్, కౌన్సిలర్ ప్రదీప్ నాయక్ పాల్గొన్నారు.