Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
మండల పరిధిలోని తమ్మర బండపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన రైతులకు పాసుపుస్తకాలు ఇప్పించాలని సోమ వారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ్మర బండపాలెం రెవెన్యూ పరిధిలో 1971లో ఇందిరాగాంధీ హయాంలో పేదల కొరకు సర్వే నెంబర్ 39లో పోరంబోకు భూములలో భూమి లేని నిరుపేదలకు 120 మంది కి10 గుం టలు చొప్పున భూమి పంచి పెట్టారని, అప్పటి నుంచి రైతులు సేద్యం చేసుకొని దానిపై వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2017- 18వ సంవత్సరంలో అసైన్డ్ భూముల్లో ఉన్న పేదలకు మేలు చేయుట కొరకు రెవెన్యూ అధికారుల ద్వారా సర్వే నిర్వహించి ప్రస్తుతం భూమిపై కబ్జాదారులుగా ఉన్న రైతులకు పాస్ బుక్కులు ఇస్తామని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇంతవరకు పేద రైతులకు పాస్ బుక్కులు అందలేదని వారు తెలిపారు. కోదాడ పట్టణ పరిధిలోని సాలార్జంగ్ పేట కొమరబండ, శ్రీరంగపురం రైతులకు ప్రభుత్వం పాస్ బుక్కులు ఇవ్వడం జరిగిందని, కానీ తమ్మర గ్రామానికి చెందిన పేద రైతులకు పాస్ బుక్కులు అందలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అనేక ప్రభుత్వ పథకాలు రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయ రుణాలు అందటం లేదని తెలిపారు. వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకుని అధికారుల ద్వారా పట్టా పాస్ బుక్లు అందించాలని కోరారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకువెళ్లి రైతులకు మేలు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీిఆర్ఎస్ నాయకులు కృష్ణయ్య, కనగాల శ్రీధర్, చందు నాగేశ్వరరావు, రైతులు ప్రసాద్, ఏసుపాదం, వెంకటనారాయణ, ఉపేందర్, లక్ష్మీనారాయణ, భాగ్యమ్మ, పుల్లయ్య, జానకి పాల్గొన్నారు.