Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అనంతగిరి
మట్టి అక్రమతవ్వకాలు మండలవ్యాప్తంగా యథేచ్ఛగా నడుస్తున్నాయి. అవసరానికి మట్టి మరమ్మతులు కీలకంగా మారాయి.దీంతో నిత్యావసర వస్తువుల జాబితాలో మట్టి ఒకటిగా చేరిపోయింది. ఈ నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గట్టుగా అందుబాటులో లేకపోవడంతో ఇదే అదునుగా భావిస్తున్న కొందరు బడాబాబులు మండలవ్యాప్తంగా మట్టి అక్రమతవ్వకాలు కొనసాగిస్తున్నారు.సంబంధిత అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా మట్టిని తవ్వుతు డబ్బులు దండుకుంటున్నారు.మట్టి తవ్వాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసు కోవాల్సి ఉంటుంది.ముందస్తుగా ఆన్లైన్ పద్ధతిలో మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకొని దాని ప్రకారం తహసీల్దార్, ఎంఓసీ ఇస్తేనే దానిని బట్టి మైనింగ్అధికారులు తాత్కాలిక అనుమతులు ఇస్తారు.నిర్దేశిత క్యూబిక్ మీటర్ల మేరకు మాత్రమే మట్టిని తవ్వాలి.కానీ కొంతమంది ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో చెరువులను సైతం తవ్వుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.యథేచ్ఛగా మట్టి తవ్వకాలకు పాల్పడుతూ ప్రభుత్వ, ప్రైవేటు భూములు లోనే కాక అటవీ భూముల్లో కూడా కొంతమంది మట్టి తవ్వకాలు చేపడుతూ రూ.లక్షలు గడిస్తున్నారు.మండల వ్యాప్తంగా లకారం, అమీనాబాద్, శాంతినగర్, పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు.కొన్ని గ్రామాల్లో వేసవికాలం కావడంతో చెరువును సైతం విడిచిపెట్టకుండా పట్టపగలే మట్టిని తోడుకుంటున్నారు.ఒకటి అరా పర్మిషన్ల పేరుతో గుట్టలను సైతం తవ్వడం గమనార్హం.అనుమతులు లేకుండా మట్టి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్న కూడా మట్టి తరలింపునకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొత్త దారులు ఎంచుకుంటున్నారని వినికిడి.వ్యవసాయ పొలానికి, భూసారవంతం కోసం చెరువు మట్టి పేరుతో రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి లేకపోయినా వెంచర్లకు తోలుకుంటూ దందాను కొనసాగిస్తున్నారు. రైతుల భూముల సారవంతం కోసం వారిని వాడుకుంటూ ఇతరత్రా వ్యాపారాలకు మట్టిని తరలిస్తూ మూడు పువ్వులు ఆరు కాయలుగా మట్టి దందాను కొనసాగిస్తున్నారు.రోజుల తరబడి అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్న కూడా సంబంధిత అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడం గమనార్హం.ఆదివారం కూడా అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తున్నారు.కొన్ని ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు సమాచారం మేరకు మట్టి తవ్వకాల ప్రాంతానికి వెళ్లి తాత్కాలికంగా పనులను నిలిపివేసిన సందర్భాలు కూడా మండల వ్యాప్తంగా చవిచూశాయి.సాధారణంగా చెరువులో మట్టి తవ్వకాలు జరపాలంటే ఇరిగేషన్ అధికారుల అనుమతి తప్పనిసరిగా ఉండాలి.కానీ కొంత మంది ప్రజాప్రతినిధుల అండదండలతో తమ సొంత గ్రామాలలో రైతులకు మట్టిని తరలిస్తున్నామని చెబుతూ వ్యాపారం చేయడం జరుగుతూనే ఉంది. ఏది ఏమైనా రైతుల పేరుతో మట్టి వ్యాపారస్తుల జేబులు నింపుతున్నాయనడంలో ఎలాంటి సందేహం.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మట్టి అక్రమతవ్వకాలను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.