Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామగ్రామాన కౌలురైతుల సమావేశం
- పెరిగిన పెట్టుబడులతో నష్టపోయిన కౌలురైతులు
- ఖరీఫ్ వరిపంటకు 9 బస్తాలు.. రబీకి 7 బస్తాలుగా తీర్మానం
- సంఘాలుగా ఏర్పడి కౌలుతీర్మానం
- ధిక్కరిస్తే రూ.50 వేల జరిమానాగా అగ్రిమెంట్
- పెన్‌పహాడ్ మండలం నారాయణగూడెం, నాగులపహాడ్ గ్రామ కౌలు రైతుల సమావేశం
- ప్రభుత్వ పథకాలను కౌలు రైతులకు వర్తింపజేయాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి- మల్లునాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
పెరిగిన పెట్టుబడులకు తోడు, వాతావరణ మార్పుల కారణంగా దిగుబడులు అంతకుఅంతకు తగ్గడంతో.. గత ఖరీఫ్, రబీలలో రైతులు తీవ్రంగా నష్టపోయారు.ఇక కౌలు రైతుల పరిస్థితి దారుణంగా మారింది. పెట్టుబడులకు తెచ్చిన అప్పులు కూడా తీరకపోవడంతో పాటు ప్రభుత్వాలు ఇస్తున్న రైతుబంధు ప్రోత్సాహకాలు అందకపోవడంతో మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు.దీంతో వ్యవసాయం తప్పా ఏమి తెలియని వీరు.. తమ బతుకులను తామే బాగుచేసుకోవలని ఏకమవుతున్నారు.ప్రస్తుతం అక్కడో.. ఇక్కడో వెలుగు చూస్తున్న కౌలు రైతుసంఘాలు, సూర్యాపేట జిల్లావ్యాప్తంగా ప్రతి గ్రామగ్రామాన ఏర్పాటవుతున్నాయి.అయా గ్రామాల్లో దిగుబడులను అంచనా వేస్తూ, సంఘంగా ఏర్పడి వరిపంట కౌలును వారే నిర్ణయించి తీర్మానం చేసుకుంటున్నారు.ఆయా గ్రామాల్లో ఉన్న కౌలురైతులు మొత్తం సమావేశం అయి తీర్మానం పై సంతకాలు చేస్తున్నారు.ఎవరైనా తీర్మానాన్ని అతిక్రమిస్తే రూ.50 వేల నుండి లక్ష రూపాయల వరకు జరిమానా కూడా విధిస్తామని దానికి అంగీకరిస్తున్నట్లు గ్రామాల్లో కౌలు రైతులతో సంతకాలు తీసేసు కుంటున్నారు.మరో వైపు రైతులకు కూడా దిగుబడుల తో సంబంధం లేకుండా పంట పండినా, పండకున్నా, తాము నిర్ణయించిన కౌలు భూ యజమానులకు ఇవ్వాలనే ఒప్పందం కూడా కౌలు రైతుల సమావేశంలోలో ఉండటం విశేషం.
ఖరీఫ్ 9 .. రబీ 7 బస్తాలు....
పెన్‌పహాడ్ మండలం నారాయణగూడెం, నాగులపహాడ్ గ్రామాలకు చెందిన కౌలు రైతులు ఆదివారం సమావేశమయ్యారు.సమావేశంలో వరి పంటకు వర్షాకాలం 9 బస్తాలు, వేసవిపంటకు 7బస్తాల కౌలుగా తీర్మానం చేశారు.ఇక బాగా పాత పొలాలు ,దిగబడే పొలాలకుగాను 8బస్తాలు, 6 బస్తాలుగా తీర్మాణం చేసుకున్నారు.సమావేశంలో ఇరు గ్రామాలకు చెందిన సుమారు 100 మంది కౌలు రైతులు పాల్గొని చేసిన తీర్మానాలకు అనుకూలంగా సంతకాలు చేశారు.
నాగులపహాడ్-నారాయణగూడెం కౌలు రైతు సంఘం ఏర్పాటు
ఒకప్పుడు ఉమ్మడి పంచాయితీగా ఉండి విడిపోయిన నారాయణగూడెం-నాగులపహాడ్ గ్రామా లకు చెందిన కౌలు రైతులంతా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు.తమ కౌలు రైతు సంఘం అధ్యక్షుడిగా నకిరేకంటి మోగి, ప్రధాన కార్యదర్శి గా సంకరమద్ది మధుసూదన్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఇసుకపల్లి రమణయ్య, కన్నెబోయిన పెద్దసైదులు, సహాయ కార్యదర్శులుగా ఆరే సతీష్‌రెడ్డి, పర్షనబోయిన చంద్రశేఖర్,కోశాధికారిగా కన్నెబోయిన చిన్న సైదులు, కార్యవర్గ సభ్యులుగా సుంకరి వెంకన్న, కొండనాగయ్య, బంటు వెంకన్న, కన్నె బోయినపుల్లయ్య, నారాయణ శ్రీనివాస్‌రెడ్డి, బూరుగు వెంకటయ్య, కందుకూరి వెంకటయ్య, తండు వెంకన్న, పోగుల జా, సుంకరబోయిన సంజీవ్, గోపాల్, నారాయణ,కృష్ణారెడ్డి, గొన్ద్ర సైదులు లు ఉన్నారు.
పథకాలను కౌలురైతులకు వర్తింపజేయాలి
రైతుసంఘం జిల్లా కార్యదర్శి-మల్లునాగార్జునరెడ్డి
రైతు సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే పథకాలను పూర్తిస్థాయిలో కౌలు రైతులకు కూడా వర్తింపజేయలి. జిల్లాలో దాదాపుగా 50 వేల మందికి పైగా కౌలు రైతులు ఉన్నారు.ప్రతిసారి సీజన్లో వచ్చే అతివష్టి ,అనావష్టికి కౌలు రైతులు నష్టపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన స్కీంలను కౌలు రైతులకు చెందే విధంగా చర్యలు చేపట్టాలి.అదేవిధంగా రైతుబంధు,రైతుబీమా పథకం కౌలు రైతులకు వర్తింపజేయాలి.2011 కౌలు చట్టం ప్రకారం కౌలుదారులకు రుణఅర్హత కార్డులు ఇవ్వాలి. ప్రభుత్వ బ్యాంకుల ద్వారా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారంగా రుణాలు ఇవ్వాలి.పంటల బీమా రుణమాఫీ కౌలురైతులకు వర్తింపచేయాలి.రాష్ట్ర ప్రభుత్వం కౌలురైతులను గుర్తించి ప్రభుత్వమే చట్టం చేయించాలి.లేనిపక్షంలో కౌలురైతుల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతాం.