Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిధుల కేటాయింపులపై ఎంపీడీవోతో వాగ్వాదానికి దిగిన సర్పంచ్,ఎంపీటీసీలు
- మనస్తాపంతో సభలో నుంచి వెళ్లిపోయిన ఎంపీపీ
నవతెలంగాణ-నాంపల్లి
ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేతరవీందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడివేడీగా జరిగింది.సమావేశం ఆద్యంతం కొన్ని శాఖల అధికారుల పని తీరుపై వాడివేడిగా జరిగింది.ఆర్‌డబ్య్లూఎస్ ఏఈ తమశాఖకు సంబంధించిన వివరాలను సభలో తెలియపరుస్తూ ఉండగా పలువురు సర్పంచులు అడ్డు తగిలి గ్రామాల్లో ప్రతిరోజు ప్రతి మనిషికి 100 లీటర్లు త్రాగునీరు అందించవలసి ఉండగా నేల మొత్తం కూడా 100 లీటర్ల తాగు నీరు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.పసునూరు గ్రామ సర్పంచ్ పోగుల దివ్య మాట్లాడుతూ తమ గ్రామానికి సంబంధించిన విద్యుత్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండకుండా మహిళా సర్పంచ్ అనే గౌరవం కూడా లేకుండా చిన్న చూపు చూస్తూ గ్రామంలో విద్యుత్ సమస్యలు వచ్చినప్పుడు కనీసం ఫోన్ కూడా ఎత్తకుండా విద్యుత్ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.నామనాయక్తండా, మల్లపురాజుపల్లి సర్పంచులు కూడా విద్యుత్ అధికారుల పనితీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. విద్యా శాఖ సమీక్ష నడుస్తూ ఉండగా పలువురు సర్పంచులు కొందరు ఉపాధ్యాయులు కేవలం జీతాల కోసమే పని చేస్తున్నారని దూర ప్రాంతాల నుంచి విధులకు హాజరవుతూ ఎప్పుడు టైం అవుతుందా వెళ్లిపోవడానికి వాహనం ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారన్నారు.ఉపాధ్యాయులు పనిచేసే చోటనే నివాసం ఉంటూ వారి పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించాలన్నారు.అదేవిధంగా మండల విద్యాధికారి నాలుగు మండలాలకు ఇన్చార్జిగా వ్యవహరిస్తుండడంతో ఆయన పాఠశాలల అభివృద్ధి పై దృష్టి సారించడం లేదని, పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం లేదన్నారు.అన్ని శాఖలపై సమీక్ష ముగిసిన అనంతరం జెడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతుండగా బండ తిమ్మాపురం ప్రాదేశిక నియోజకవర్గపరిధిలోని శుంకిశాల సర్పంచ్ మధ్యలో కల్పించుకొని మండల పరిషత్ నిధులు బండ తిమ్మాపురం సర్పంచ్ కేటాయించలేదని అడుగుతుండగా ఎంపిపి కల్పించుకొని బండ తిమ్మాపురం ఎంపీటీసీ ఆ సమస్యపై మాట్లాడతారు ..మీరు కూర్చోండి అని చెప్పినప్పటికీ ఆయన వినకుండా వాగ్వాదానికి దిగడంతో మనస్తాపంతో సమావేశం నుండి ఎంపీపీ బయటికి వెళ్లిపోయారు.ఎంపీపీ బయటికి వెళ్లిపోయాక నాంపల్లి, బండతిమ్మాపురం ఎంపీటీసీలు, శుంకిశాల సర్పంచ్ మండల పరిషత్ నిధుల కేటాయింపుపై ఎంపీడీవోతో వాగ్వివాదానికి దిగారు.సభాధ్యక్షులు ఎంపీపీ సమావేశం నుండి వెళ్లిపోయిన కారణంతో ఎంపీడీవో కూడా తన చాంబర్‌కు వెళ్లిపోవడంతో సమాధానం చెప్పకుండా ఎంపీడీవో సభ నుండి వెళ్లి పోవడం పట్ల పలువురు సర్పంచులు ఎంపీటీసీలు ఆయన చాంబర్లో చాలాసేపు కూర్చుని నిధుల కేటాయింపుపై సమాధానం చెప్పాలని వాగ్వివాదానికి దిగారు. చివరికి జెడ్పీటీసీ కల్పించుకొని అందరికీ సర్ది చెప్పడంతో సమస్య సద్ధుమణిగింది.ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ పానుగంటి రజిని, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె.శేషుకుమార్, మండలపంచాయతీ అధికారి ఈశ్వరయ్య, తహసీల్దార్ లాల్‌బహదూర్, మాల్ మార్కెట్ చైర్మెన్ దంటు జగదీశ్వర్, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల అధికారులు పాల్గొన్నారు.