Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సంస్థాన్‌నారాయణపురం
నారాయణపురం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం పలు నిరసన నినాదాలతో మార్మోగింది. మంగళవారం ఎంపీపీ గుత్తా ఉమాదేవి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం నిరసన కార్యక్రమాలు,నినాదాలకు వేదికయ్యింది. అధికార,ప్రతిపక్ష పార్టీలు అనే తేడా లేకుండా సమావేశానికి హాజరైన సర్పంచులు ఒకరిద్దరు మినహా అందరూ కింద కూర్చుని నిరసన కార్యక్రమం చేపట్టారు. వాసాలమర్రిలో ముఖ్యమంత్రి ప్రకటించిన గ్రామ పంచాయతీ అభివద్ధి కోసం రూ.25 లక్షలు రాకుండా అడ్డుపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా అభివద్ధిలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి రూ.25 లక్షలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన నిధులను వెంటనే విడుదల చేయాలని పట్టుబట్టారు.రైతు వేదికల నిర్మాణాల కోసం గ్రామ పంచాయతీలకు కేంద్రం ప్రకటించిన ఈజీఎస్ నిధులు రూ.14 కోట్లు వెంటనే మంజూరు చేయాలనీ డిమాండ్ చేశారు.గంట సేపుకు పై గా సర్పంచుల నిరసన నినాదాలతో సమావేశం హాలు మారుమోగిపోయింది.యాదాద్రి భువనగిరి జిల్లాలో 18 మండలాలు ఉండగా కేవలం నారాయణపురం, చౌటుప్పల్ మండ లాలకు మాత్రమే ముఖ్యమంత్రి ప్రకటించిన నిధులు ఎందుకు రావు అని సర్పంచులు ప్రశ్నించారు. మునుగోడు కు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించడం వల్లనే అధికార పార్టీకి చెందిన ఈ ప్రాంత ఇంచార్జి, జిల్లా మంత్రి ఉద్దేశపూర్వకంగానే నిధులు ఆపేసినట్లు సర్పంచులు ఆరోపించారు. శిలాఫలకాలపై పేర్ల కోసం వారు చూస్తుంటే గ్రామాల్లో ప్రజలతో మేము తిట్లు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.సర్పంచులు నిరసన కార్యక్రమాన్ని విరమించి సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. వెంటనే నారాయణపురం ఎంపీటీసీ బచ్చనగోని గాలయ్య అభివద్ధి నిధుల కేటాయింపుల్లో ఎంపీడీవో, ఎంపీపీ ఉద్దేశపూర్వకంగానే తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఎంపీడీవోకు ,ఎంపీటీసీలు అంటే లెక్క లేకుండా పోయిందన్నారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో జనరల్ ఫండ్‌కు సంబంధించిన జమా ఖర్చులు చెప్పడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం నుండి వచ్చే ఆయా శాఖల అభివద్ధి నిధులు అడిగిన చెప్పకుండా ఎంపీడీవో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివద్ధి నిధుల కేటాయింపుల్లో ఆయా ఎంపీటీసీి లకు ఇచ్చిన ప్రాధాన్యత తనకు ఇవ్వడం లేదని నినదించారు.ఎంపీడీవో,ఎంపీపీలు ప్రతిపక్ష పార్టీల ఎంపిటిసి లకు కనీస విలువలు ఇవ్వడం లేదన్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని ఎంపిడిఓ పై చర్య తీసుకోవాలని కోరారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వివిధ శాఖ అధికారులపై నామమాత్రంగా చర్చ జరిపారు.ఈ సమావేశంలో ఎంపీపీ గుత్తా ఉమా,వాయిస్ ఎంపీపీ రాజు,జడ్పిటిసి వీరమల్ల భానుమతి,ఇన్చార్జి తాసిల్దార్ పల్లవి,ఎంపీడీవో యాదగిరి, పలువురు ఎంపీటీసీలు పాల్గొన్నారు.