Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
ఈ నెల 15 ,16 తేదీల్లో తిరుమలగిరిలో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలని ఆ సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లిరాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లిసైదులు కోరారు. శుక్రవారం స్థానిక జ్యోతిరావు పూలే చౌరస్తా వద్ద కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో అనేక గ్రామాలలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్న రెవెన్యూ అధికారులు పట్టీ పట్టనట్లు గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పేదలు ఇల్లు కట్టుకోవడానికి గుడిసె వేసుకుంటే తొలగిస్తున్న రెవిన్యూ అధికారులు, అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ భూములను అక్రమంగా అప్పనంగా ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడన్నారు. 8సంవత్సరాల కాలంలో పేదలు తమకు ఇంటి స్థలం వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారని ఇంటి స్థలం కాని ఇల్లు కాని ఇచ్చిన పాపాన ప్రభుత్వం పోలేదన్నారు. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశాలకు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తమ్మినేని వీరభద్రం, జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్, రాష్ట్ర నాయకులు, 33 జిల్లాల ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పులుసు సత్యం , తెలంగాణ గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య , జిల్లా కమిటీ సభ్యులు కడెం కుమార్ ,పడమటింటి నగేష్, వనం సోమయ్య, నిర్మల యాకయ్య, పానగంటి శ్రీను, నాగుల గాని సోమయ్య, సీతారాములు పాల్గొన్నారు.