Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా ప్రధానకార్యదర్శి కొండమడుగు నర్సింహ
నవతెలంగాణ - ఆలేరుటౌన్
కేరళ రాష్ట్రం తరహలో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఉపాధిహామీ పనులు కల్పించాలని వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ఏసీరెడ్డి భవనం ఆవరణలో నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని మున్సిపాలిటీల్లో అమలు చేయకపోవడంతో నిరుపేదలకు పనుల్లేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వ్యవసాయం మీద ఆధారపడిన కూలీలు, ఉపాధి లేని పేదలు ఉన్నారని, వారందరికీ ఉపాధి పనుల్లేక హైదరాబాద్ ,ముంబాయి వంటి పెద్ద పట్టణాలకు వలసెళ్లుతునానరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేరళ రాష్ట్రం మాదిరిగా మున్సిపల్ పట్టణాలలో ఉపాధి చట్టాన్ని వర్తింపజేయాలని కోరారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇల్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని చెప్పి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక్కరికి కూడా ఒక ఇల్లు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆవాజ్ జిల్లా అధ్యక్షులు ఎంఏ. ఎక్బాల్, వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి జూకంటి పౌల్ , మండల పట్టణ నాయకులు బొమ్మకంటి లక్ష్మీనారాయణ, మిట్ట శంకరయ్య, ఘనగాని మల్లేశం తదితరులు పాల్గొన్నారు.