Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పట్టించుకోని అధికారులు నష్ట పోతున్న అన్నదాతలు
నల్గొండ, సూర్యాపేట జిల్లాలో నకిలీ వరి విత్తనాల దందా జోరుగా సాగుతోంది. ప్రతి సీజన్లోనూ విత్తనాలు నకిలీని అమ్ముతూ అన్నదాతలను మోసం చేస్తున్నారు. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నా పట్టించుకునే పాపాన పోవడం లేదు. దీంతో ప్రతి సీజన్లో రైతుల మోసపోతు ఆర్థికంగా నష్టపడుతున్నారు. సూర్యాపేట జిల్లా గరేడేపల్లి మండలంలోని గడ్డిపల్లి వ్యవసాయ విత్తన కేంద్రంగా దందా సాగుతుంది.
నవతెలంగాణ-మిర్యాలగూడ
గతంలో కేవలం ప్రభుత్వం అనుమతించిన రకాలను మాత్రమే విత్తనం చేసి సరఫరా చేసేవి. ఇప్పుడు కొన్ని మిల్లులు అనుమతి లేకున్నా ప్రయివేటు రకాలను రైతులనుంచి నేరుగా సేకరించి ప్రముఖ కంపెనీ బ్రాండ్లతో విక్రయిస్తున్నారు. విత్తనంకు ఎటువంటి నాణ్యత ప్రమాణాలు లేకున్నా అమ్ముతున్నారు. కొన్ని సంచులకు నేరుగా బ్రాండ్ పేరు పెట్టి విక్రయిస్తుండగా మరి కొన్ని మిల్లులు తెల్ల సంచులో ప్యాకింగ్ చేసి అమ్ముతున్నాయి. కొన్న విత్తనాలకు బిల్లులు అడిగితే విత్తనాలు ఇవ్వడం లేదు. ఈ విషయం వ్యవసాయ శాఖ, తూనికల కొలతల శాఖ అధికారులు తెలిసినా పట్టించుకోవడం లేదు.
నకిలీ విత్తనాలతో నష్ట పోయిన రైతులు
తక్కువ ధరకు విత్తనాలు అమ్ముతుండడంతో రైతులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. గత సీజన్లో వేలాది మంది రైతులు నత్తిని విత్తనాలు కొనుగోలు చేసి వేలాది రూపాయలు నష్టపోయారు. నకిలీ విత్తనాలు నాటితే నారుమండ్లు సరిగా రాకపోవడంతో పెట్టిన పెట్టుబడులు నష్టపోవాల్సి వస్తోంది. మళ్లీ విత్తనాలు కొనుగోలు చేసి నాటాల్సిన పరిస్థితి గతంలో చోటుచేసుకున్నాయి. ఆయకట్టు ప్రాంతమైన హాలియా, నిడ్మనూరు, త్రిపురారం, మిర్యాలగూడ, సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల గరిడేపల్లి, హుజూర్నగర్, చిలుకూరు, కోదాడ ప్రాంతాలలో రైతులు నకిలీ విత్తనాలు నాటి పెద్ద ఎత్తున నష్టపోయారు. డిమాండ్ ఉన్న సమయంలో రైస్ మిల్లు నుండి ధాన్యం తీసుకొచ్చి మిల్లు పట్టించి విత్తనాలుగా అమ్ముతున్నారు. కొనుగోలు చేసిన నకిలీ విత్తనాలకు బిల్లులు లేకపోవడంతో రైతులు ప్రశ్నించలేక పోతున్నారు.
కోట్లు సంపాదిస్తున్న వ్యాపారస్తులు
సూర్యాపేట జిల్లా గరేడేపల్లి మండలం గడ్డిపల్లి వ్యవసాయ క్షేత్రం వద్ద నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతోంది. కొందరు డీలర్లు మిల్లు నుండి ధాన్యం కొనుగోలు చేసి దానిని మర పట్టించి విత్తనాలుగా విక్రయిస్తున్నారు. అసలు విత్తనాల ధర కంటే తక్కువ ధర చూపి విక్రయిస్తున్నారు. దీంతో రైతులు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి నష్టపోతున్నారు. ప్రతి సీజన్లో ఈ వ్యాపారసులు నకిలీ విత్తనాలమ్మి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా కొందరు గడ్డిపల్లి కేంద్రంగా నకిలీ విత్తనాలు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గడ్డిపల్లిలో ఉన్న ఓ విత్తన విక్రయ కేంద్రం ఓ మండల వ్యవసాధికారికి సంబంధించినది కావడం విశేషం.
పట్టించుకోని అధికారులు
నకిలీ వరి విత్తనాలు విక్రయాలను అరికట్టాల్సిన వ్యవసాయ శాఖ, తునికల కొలతల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పే మాటలు ప్రకటనలకే పరిమితం అవుతుంది. నకిలీ విత్తనాల విషయంపై ప్రముఖ వరి విత్తనాల కంపెనీల డీలర్లు, వ్యాపారస్తులు అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోతుంది. గతంలో అనేకమార్లు ఫిర్యాదులు చేసిన కనీస విచారణ జరిగిన దాఖలాలు కూడా లేవు. అధికారుల కనుసన్న లోనే ఈ దందా జరుగుతుందని పలువురు వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు.
నా దష్టికి రాలేదు-రామారావు నాయక్,జిల్లా వ్యవసాయ అధికారి
గరేడేపల్లి మండలం గడ్డిపల్లిలో నకిలీ విత్తనాలు అమ్ముతునట్లు నా దష్టికి రాలేదు.అలాంటిది ఏమి లేదు.ఏమైనా ఉంటే విచారించి చర్యలు తీసుకుంటాం.