Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటిరంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
కార్మికులు తమ హక్కుల కోసం ఐక్యపోరాటాలు చేయాలని మాజీ ఎమ్మెల్యే,సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు.బుధవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సీఐటీయూ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్తచట్టాల రద్దు కోసం బలమైన పోరాటాలు చేయాలన్నారు.కార్మికుల హక్కులు, సంక్షేమాన్ని కాల రాసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తచట్టాలు తీసుకొచ్చిందని విమర్శించారు.ఈ చట్టాల వల్ల కార్మికులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేట్పరం చేస్తూ కార్మికులకు ఉపాధిలేకుండా చేస్తుందన్నారు.కార్మిక వ్యతిరేక విధానాలను ఉద్యమాల ద్వారా తిప్పికొట్టాలని సూచించారు.అన్ని రంగాలలో పనిచేసే కార్మికులు తమ హక్కుల సాధన కోసం, కార్మిక వ్యతిరేక విధానాలను రద్దు చేసేంతవరకు ఉద్యమాలు చేపట్టాలని కోరారు. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు ఒకటి నుండి 15 వరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.ఆగస్టు 14న రాత్రంతా కార్మిక జాగరణ దీక్షలు చేపట్టాలని సూచించారు.ఆయా రంగాల్లో పనిచేసే కార్మికులు కలిసికట్టుగా ఉండి మహాసభలు నిర్వహించుకుని కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.కార్మికుల పక్షాన సీఐటీయూ నిరంతరం పోరాటం చేస్తుందని, కార్మికులు అండగా నిలిచి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డబ్బికార్ మల్లేష్, నాయకులు డా.మల్లుగౌతమ్రెడ్డి, పాపిరెడ్డి, గుణగంటి రాంచంద్రు, లింగమయ్య,బీఎం.నాయుడు పాల్గొన్నారు.