Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. పెరిగిన ధరలను వంట గ్యాస్ ధరలను తగ్గించాలని ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక నల్లాల భావి సెంటర్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకు గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై విపరీతమైన భారాలు మోపుతుందన్నారు. ఇప్పటికే పెట్రోలు,డీజీల్ ధరలు పెరిగి వాటి ప్రభావం నిత్యవసర సరుకుల మీద పడి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా గ్యాస్ ధరలను రోజురోజుకు పెంచడం దుర్మార్గం అన్నారు.మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 380 రూపాయలు ఉన్న గ్యాస్ ధరను 1105 రూపాయలకు పైగా పెెంచాడన్నారు. పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని లేనియెడల ప్రజలను సమీకరించి ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు,కోట గోపి,వేల్పుల వెంకన్న, ఎలుగురి జ్యోతి,జె.నరసింహారావు చిన్నపంగి నరసయ్య,వీరబోయిన రవి పట్టణ నాయకులు సాయికుమార్,లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను తగ్గించాలని ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్ట సరోజ డిమాండ్ చేశారు. గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మండలకేంద్రంలో గురువారం ఆ సంఘం ఆధ్వర్యంలో కట్టెల పొయ్యి వంటతో,గ్యాస్ సిలిండర్‌తో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరేంద్ర మోడి అధికారంలోకి వచ్చిన నాటికి రూ..430 ఉన్న సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 1105పెంచి పేద,మద్య తరగతి కుటుంబాల వారు తిరిగి కట్టెల పొయ్యి తో వంట చేసుకొనే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. వెంటనే ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం చిట్యాల మండల కార్యదర్శి పామనుగుల్ల జయమ్మ,నాయకురాలు జిట్ట రమాదేవి,శ్రీదేవి,గౌసియా,ఉప్పలపల్లి లక్ష్మమ్మ ,సుల్తానా,రఫీదా,యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.
కోదాడరూరల్ : కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు. టౌన్ కార్యదర్శి మిట్టగనుపుల ముత్యాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలో సూర్యాపేట రోడ్ లోని జాతీయ రహదారిపై కోటిరెడ్డి వీధి దగ్గర ఆ పార్టీ ఆధ్వర్యంలో కట్టెల పొయ్యితో మహిళలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక ఈ సంవత్సర కాలంలో గ్యాస్ ధర నాలుగు సార్లు పెంచగా కేవలం మే నెల తర్వాతే మూడుసార్లు పెరిగిందన్నారు. పరుగుతున్న వంట గ్యాస్ ధరలతో సామాన్య ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు వేలది పద్మావతి,పార్ట టౌన్ కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాస్, దుర్గ ,రజిని, విజయ, సంధ్య, ప్రసాదు, మహేష్, లింగమూర్తి, సంతోష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు..
నల్లగొండకలెక్టరేట్ : ప్రజలపై భారం మోపుతున్న గ్యాస్ ధరలు తగ్గించాలని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ గురువారం పట్టణంలోని 42 వ వార్డులో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2014 బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉజ్వల పథకం పేరుతో ఉచిత గ్యాస్ ను ప్రజలకు విరివిగా 9కోట్ల కనెక్షన్లు ఇచ్చినా 90లక్షల మంది గ్యాస్ ను తీసుకోలేదని కేవలం 1.08కోట్ల మంది మాత్రమే తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుత కరోనా కష్టకాలంలో ప్రజలు ఉపాధి కోల్పోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో గ్యాస్ ధరలు ప్రజలకు గుదిబండగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ కొనలేక మహిళలు కట్టెల పొయ్యి శరణ్యమని గ్యాస్ పక్కకు వేసే పరిస్థితి వచ్చిందనీ ఆరోపించారు. పెంచిన ధరలతో కుటుంబ పోషణ భారంగా మారుతుందనీ అందుకే ప్రభుత్వం వెంటనే పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళలను చైతన్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం అని హెచ్చరించారు. పెరుగుతున్న గ్యాస్ ధరలు ఆర్థిక భారంతో సంసారాలు ఈదలేక సతమతమవుతున్న మహిళలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పట్టణ కార్యదర్శి భూతం అరుణ కుమారి మాట్లాడుతూ ఉండడానికి సొంత ఇండ్లు లేక అద్దె ఇంటికి కిరాయిలు కట్టలేక సతమతం అవుతున్నారని ఈ సమయంలో గ్యాస్ ధరలు పెంచడం దారుణమని పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని అన్నారుఈ కార్యక్రమ పార్వతమ్మ, దుర్గమ్మ, నాగమ్మ, సునీత, లక్ష్మమ్మ, బిక్షమమ్మ, శ్రీదేవి, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.