Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నవతెలంగాణ-భువనగిరి,భువనగిరిరూరల్
రాష్ట్రంలో 24 నుంచి 28 శాతం పచ్చదనం పెరిగిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో 33శాతం సాధిస్తామని రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణ శాఖల మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.గురువారం జిల్లా కేంద్రం శివారులో 2 ఎకరాల విస్తీర్ణంలో రూ.3.50కోట్లతో నూతనంగా నిర్మించిన జిల్లా అటవీ అధికారి కార్యాలయ కాంప్లెక్స్ భవనాన్ని ఆయన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడారు.సీఎంకేసీఆర్ ఆలోచన మేరకు గ్రామాలలో, అడవి నశించిపోయిన ప్రాంతాలలో పునరుజ్జీవన కార్యక్రమం కింద పెద్దఎత్తున మొక్కలు నాటడం, పచ్చదనం పెంపొందించామన్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అడవులు చాలా తక్కువగా వున్నాయన్నారు.అడవులు పెంపొందించాలనే ముఖ్యమంత్రి ఆలోచనలో భాగంగా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల అటవీ అధికారులు ప్రత్యేకచర్యలు తీసుకోవాలని తెలిపారు.రాష్ట్రంలో పచ్చదనం 33 శాతం ఉండాలనేది ముఖ్యమంత్రి తపన అని, దానికనుగుణంగా 24 శాతం నుండి 4 శాతం పచ్చదనం పెరిగిందన్నారు.రాబోయే రోజులలో 33 శాతం సాధిస్తామని, తద్వారా వర్షాలు సకాలంలో కురుస్తాయన్నారు.తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిని చూసి భారతదేశంలోని ప్రతి రాష్ట్రం అనుకరిస్తున్నదన్నారు.ప్రతి గ్రామ పంచాయతీలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ట్రాక్టర్స్, ట్యాంకర్స్ సమకూర్చి చెత్త తరలించడం, మొక్కలకు నీరు అందించి సంరక్షించడం జరుగుతున్నదని తెలిపారు.రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, పట్టణాలలో ఫారెస్ట్, హెచ్ఎండీఏ,జీహెచ్ఎంసీ, అధ్యర్యంలో 15 వేల నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచడం, అందుకు అనుగుణంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నట్టు తెలిపారు.ఇప్పటికే 230 కోట్ల మొక్కలకు గాను 249 కోట్ల మొక్కలను నాటామన్నారు.తెలంగాణకు జాతీయ అవార్డులు ఎక్కువగా వస్తున్నాయని, అధికారులతో పాటు ప్రజా ప్రతినిధుల పాత్ర అమోఘంగా ఉందన్నారు. గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలు పెద్దఎత్తున జరుగుతున్నాయని, అందుకు అందర్ని అభినందిస్తున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి,జెడ్పీ చైర్మెన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ అన్నెబోయిన ఆంజనేయులు, రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శాంతికుమారి, రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ ఛీఫ్ కన్సర్వేటర్ రాకేశ్‌మోహన్ డోబ్రియాల్, కలెక్టర్ పమేలాసత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్‌తివారీ, యాదాద్రి సర్కిల్ ఫారెస్టు కన్సర్వేటర్ శివానీడోగ్రా, జిల్లా అటవీ అధికారి ఐ.పద్మజారాణి, ఎంపీపీ నరాల వెంకటస్వామియాదవ్, భువనగిరి ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ కె.కిరణ్‌కుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.