Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
రోడ్డుపై పడిపోయిన 11 లక్షల నగదు కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇరువురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం సాయంత్రం డీఎస్పీ కార్యాలయంలో ఈ కేసు వివరాలను ఆయన వెల్లడించారు. పట్టణానికి చెందిన మంచుకొండ జగదీష్ ఈ నెల 27 న సాయంత్రం 7.40 నిమిషాల సమయంలో స్థానిక లారీ ఆఫీస్ నుండి ఎంపీడీవో ఆఫీస్ మీదుగా హౌసింగ్ బోర్డ్ కు రేగ్జిమ్ క్లాత్ లో 11 లక్షల నగదును పట్టుకొని ద్విచక్ర వాహనానికి తగిలించుకొని వెళుతుండగా మార్గం మద్యలో పడిపోయింది. డబ్బుల సంచి కనిపించకపోవడంతో వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు కోర్టు అనుమతి తీసుకొని ఎంపీడీవో ఆఫీస్ నుండి హౌసింగ్ బోర్డ్ వరకు పరిసరాలలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి మండలంలోని ఆలగడపకు చెందిన ఇంద్రపల్లి వెంకటేశ్వర్లు అతని బామ్మర్ది నాగరాజుల వద్ద నగదు ఉన్నట్టు కనిపెట్టారు. దీంతో 11 లక్షల రూపాయల నగదును స్వాధీనం పరుచుకొని వెంకటేశ్వర్లు అతని బామ్మర్ది నాగరాజు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు తెలిపారు. కేసును చేదించిన పోలీసు సిబ్బందిని అభినందించారు. ఈ సమావేశంలో వన్‌టౌన్ సిఐ రాఘవేందర్, ఎస్సై సుధీర్ కుమార్, పోలీస్ సిబ్బంది వెంకటేశ్వర్లు, రవి, రామకష్ణ, వెంకటేశ్వర్లు, తదితరులున్నారు.