Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ సంపద కార్పొరేట్ శక్తుల పరం : నారి ఐలయ్య
నవతెలంగాణ-నకిరేకల్
దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేక పోరాటాలు ఉధృతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి నారి ఐలయ్య పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని కే.ఆర్ ఆడిటోరియంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు వ్యవసాయ రంగాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను సరళీకత ఆర్థిక విధానాల పేరుతో ప్రయివేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోరాడి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి నిధులు తగ్గించి నిరుగార్చే కుట్ర పూనుకుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ వాటికి కేటాయించాల్సిన బడ్జెట్ను దశలవారీగా తగ్గిస్తూ నష్టాల పేరుతో ప్రయివేట్ వ్యక్తులకు ఉదారంగా అమ్మేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మడం కోసమే మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయడం దుర్మార్గమన్నారు. ప్రపంచీకరణలో భాగంగా సరళీకరణ, ఆర్థిక విధానాలు మూలంగా సహజవనరులను కారుచౌకగా దారాదత్తం చేస్తూ ప్రయివేట్ కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తుందన్నారు. ఈ విధానాలను ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలని, ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాలని, కేంద్ర ప్రభుత్వం ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు జరపాలని, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మర్రి బక్కయ్య అద్యక్షతన జరిగిన ఈ మహసభలో మహిళ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బోజ్జ చిన వెంకులు, జిల్లా సహయ కార్యదర్శి చింతపల్లి లూర్ధుమారయ్య, కల్లు గీత కార్మిక సంఘం జిల్లా సహయ కార్యదర్శి రాచకొండ వెంకన్న, వ్యకాస మండల నాయకులు సాకుంట్ల నర్సింహ్మ, గ్యార సైదులు. ఎల్లమ్మ, సరికోండ లింగస్వామి, రాజు, వంటెపాక కష్ణ, తదితరులు పాల్గొన్నారు.