Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేటాయించిన శాఖల్లో చేరేందుకు సుముఖత సీనియార్టీ కోల్పోతాం...
- ప్రభుత్వంపై కేసు వేసేందుకు సిద్ధం
నవతెలంగాణ-నల్లగొండ
రెవెన్యూ శాఖలోని క్షేత్రస్థాయిలో కీలకంగా పని చేసిన వీఆర్వోల వ్యవస్థను పూర్తిగా తొలగించేందుకు రాష్ట్రప్రభుత్వం గత రెండేళ్ల కిందట నిర్ణయం తీసుకుంది. ఇకపై విలేజ్ రెవెన్యూ ఆఫీసర్(వీఆర్వో)లు ఉండబోరని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత 22 నెలలుగా వీఆర్వోలకు ఎలాంటి విధులు కేటాయించకపోవడమే కాకుండా ఇతర శాఖలకు సైతం బదిలీ చేయలేదు. దీంతో రాష్ట్రప్రభుత్వం వీఆర్వోల వ్యవస్థను రద్దుచేసి వారిని ఇతర శాఖలకు కేటాయిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇతర శాఖలకు సర్దుబాటు చేయడంపై వీఆర్వోలు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లుగా రెవెన్యూలోని గ్రామాల పరిధిలో భూములకు సంబంధించి వ్యవహారాలను చూసుకున్న తాము ఇతర శాఖలకు వెళ్లి ఏం పనులు చేయాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. మరోవైపు సీనియార్టీని కోల్పోతున్నామని, ఉద్యోగ పదోన్నతి పొందే సమయంలో ఇతర శాఖలకు జూనియర్ అసిస్టెంట్‌గా కేటాయిస్తే నష్టపోతామంటూ పలువురు సీనియర్ వీఆర్వోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో తమను రెవెన్యూలోనే కొనసాగించాలని వీఆర్వోలు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాలో 294 మంది వీఆర్వోలు..
జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొత్తం 31 మండలాలు ఉండగా సుమారు 500 పై చిలుకు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 335 పోస్టులు ఉండగా 294 మంది వీఆర్వోలుగా విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. రెండేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూశాఖలో వీఆర్వో వ్యవస్థను తొలగించిన విషయం తెలిసిందే. దీంతో 22 నెలలుగా వీఆర్వోలు తమ విధులకు దూరంగా ఉన్నారు. కొందరిని ఇతర శాఖలకు కేటాయించినప్పటికీ విధుల్లో హాజరవుతూ వచ్చారు. మరి కొంత మంది వీఆర్వోలను ధాన్యం కొనుగోళ్ల సమయంలో విధులు కేటాయించారు. దీంతో ఆ విధుల్లో పని చేసేందుకు వీఆర్వోలు సుముఖత చూపలేదు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేయవద్దంటూ ప్రభుత్వంపై వీఆర్వో సంఘాలు ఒత్తిడి తెచ్చినప్పటికీ ప్రభుత్వం రద్దుకే మొగ్గు చూపింది. చివరకు వీఆర్వోల వ్యవస్థను రద్దుచేస్తూ ఇతరశాఖలకు సర్దుబాటు చేసింది. జిల్లాలో వీఆర్వోలను లాటరీ పద్ధతిన 38 శాఖలలో సర్దుబాటు చేశారు.
హైకోర్టును ఆశ్రయించనున్న వీఆర్వోలు...
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వీఆర్వోలను రెవెన్యూశాఖ నుంచి ఇతర శాఖలకు కేటాయిస్తూ సర్దుబాటు చేసింది. దీనిపై వీఆర్వోల సంఘాలు, వీఆర్వోలు ఆయా శాఖల్లో విధుల్లో చేరేందుకు సుముఖత చూపడం లేదు. ప్రభుత్వం ఆయా శాఖలకు కేటాయించినప్పటికీ విధుల్లో చేరకుండా ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేద్దామని వీఆర్వోల సంఘాలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని వీఆర్వోలు పలు సంఘాల ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. సర్దుబాటు చేయడంపై వీఆర్వోలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సర్దుబాటు చేయడంతో సీనియార్టీని కోల్పోతున్నామని, మెజారిటీ వీఆర్వోలు సమావేశంలో తమ ఆవేదనను వ్యక్తం చేసినట్టు సమాచారం. సర్దుబాటులో సీనియారిటీకి తగిన పోస్టులు ఇవ్వట్లేదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సర్దుబాటులోని అవకతవకలపై, ఇబ్బందులపై హైకోర్టును ఆశ్రయించబోతున్నట్టు సమాచారం. న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తామంటూ ఆ సంఘం నేతలు చెబుతున్నారు.
సీనియార్టీని కోల్పోతున్నాం..
-పగిళ్ల వెంకట్ (వీఆర్వో సంఘం జిల్లా అధ్యక్షులు )
వీఆర్వోలను ఇతర శాఖలకు పదోన్నతి లేకుండా కేటాయించడంతో సీనియర్ వీఆర్వోలకు అన్యాయం జరుగుతుంది. ఇతర శాఖలకు జూనియర్ అసిస్టెంట్‌గానే కేటాయించడంతో సీనియార్టీని కోల్పోతున్నాం. సర్వీస్ రూల్స్ ఇవ్వకుండానే సర్దుబాటు చేయడం సరికాదు. ఇతర శాఖలకు బదిలీ చేస్తే రెండేళ్ల కిందట విధుల్లో చేరిన సమానంగా పనిచేయాల్సి వస్తోంది. సర్దుబాటుతో తాము తీవ్రంగా నష్టపోతున్నాం. హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తాం.
రెవెన్యూలోనే కొనసాగించాలి..
-జిల్లా వెంకన్న (వీఆర్వో)
వీఆర్వోలను రెవెన్యూశాఖలోనే కొనసాగించాలి. ఇతర శాఖలకు బదిలీ చేయడంతో ఆ శాఖల్లో ఎలాంటి విధులు నిర్వహించాలనే దానిపై అవగాహన లేకుండాపోతుంది. ఇన్నేళ్లుగా రెవెన్యూలోని క్షేత్రస్థాయిలో భూముల వ్యవహారం చూసుకుంటూ వచ్చాం. కావున రెవెన్యూలోనే ఏదో ఒక విధుల్లో తమను కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.