Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గొర్ల ఇంద్రారెడ్డి ప్రధమ వర్థంతిసభలో జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
అమరవీరుల ఆశయాలు భవిష్యత్తు పోరాటానికి మార్గదర్శకాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామంలో శుక్రవారం అమరజీవి సీపీఐ(ఎం) నాయకులు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ గొర్ల ఇంద్రారెడ్డి ప్రధమ వర్థంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. కామ్రేడ్ గొర్ల ఇంద్రరెడ్డి ఈ ప్రాంతంలో సీపీఐ(ఎం) నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ గట్టికోప్పుల రామిరెడ్డి పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తూ సీపీఐ(ఎం) బలోపేతానికి, నిర్మాణానికి పాటుపడ్డారని చెప్పారు. తడకమళ్ళ ప్రాంతంలో రైతంగానికి సామాన్య ప్రజానీకానికి ఏ సమస్య వచ్చినా వాటి పరిష్కారం కోసం పాటుపడే వారని కొనియాడారు. ప్రతి మానవునికి పుట్టుక, మరణం సహజమని కానీ పుట్టుక మరణ మధ్యలో వారు ఎవరికోసమైతే జీవించారో అది వారి ఉన్నతాన్ని, త్యాగాన్ని, మరణించిన తర్వాత కూడా వారు ప్రజలలో నిలిచి ఉంటారన్నారు. ఈ సందర్భంగా వారితో పాటే మరణించినటువంటి ఆయన కుమారుడు భరత్ కూడా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు రాగిరెడ్డి మంగారెడ్డి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శిరవి నాయక్, రైతు సంఘం మండల అధ్యక్షుడు గోవిందరెడ్డి, కార్యదర్శి కోట్ల శ్రీనివాసరెడ్డి, ఉపసర్పంచ్ సైదమ్మ, డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పతాని శీను, సీపీఐ(ఎం) నాయకులు పుల్లయ్య, లక్ష్మయ్య, అరబోయిన వీరమ్మ, శీను, వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.