Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవంబర్8న నల్లగొండలో రైతు బహిరంగ సభ
- రైతు సంఘం రాష్ట్ర నాయకులు సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై అనేక పోరాటాలు చేసి విజయాలు సాధించిన రైతాంగ స్ఫూర్తితో పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, కనీస మద్దతు ధర చట్టం పార్లమెంటులో ఆమోదించి రైతాంగానికి మేలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నవంబర్ 8,9,10 తేదీలలో నిర్వహించే తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా 8న నల్లగొండ పట్టణంలో జరిగే రైతు బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం దొడ్డి కొమరయ్య భవన్లో మహాసభల జయప్రదం కోసం నల్లగొండ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ..సేంద్రియ ఎరువుల వాడకం తగ్గించాలని, పీఎం ప్రణామ్ పథకం పేరుతో ఎరువులపై ఉన్న సబ్సిడీని ఎత్తివేసే కుట్ర జరుగుతుందన్నారు. 8న జరిగే బహిరంగ సభలో ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ నాయకులు పాల్గొంటున్నట్టు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా రైతాంగాన్ని కలిసి మహాసభల విశిష్టత, బహిరంగ సభలో పాల్గొనాల్సిన ప్రాధాన్యత వివరిస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు సయ్యద్ హాశమ్ అధ్యక్షతన జరిగిన ఈ విస్తృత సమావేశంలో ఆహ్వాన సంఘం నాయకులు ఊట్కూరి నారాయణరెడ్డి, ఎండి సలీమ్, దండెంపల్లి సత్తయ్య, నన్నూరి వెంకటరమణారెడ్డి, కొండ అనురాధ, నలపరాజు సైదులు, మన్నె బిక్షం, కందుల సైదులు, పుల్లెంల శ్రీకర్, ఇందుగుల సర్పంచ్ కన్నయ్య, కుంభం కృష్ణారెడ్డి, మధుసూదన్ రెడ్డి, చిలకరాజు బిక్షం, బ్రహ్మానందరెడ్డి, గుణాల పూరి మారయ్య, తదితరులు పాల్గొన్నారు.