Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న సిమెంట్, స్టీల్, ఇసుక, నిర్మాణముడి సరుకుల ధరలు తగ్గించి కార్మికుల ఉపాధిని కాపాడుకుందామని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ.సలీమ్ డిమాండ్ చేశారు. శనివారం దొడ్డి కొమరయ్య భవన్లో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నల్లగొండ పట్టణ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణరంగంలో పనిచేస్తున్న కార్మికులకు పని దినాలు తగ్గి ఆదాయం పడిపోయందన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం, విద్య, వైద్యం మరింత ఖరీదు కావడం కార్మికుల జీవిత అవసరాలు తీరక పస్తులతో గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిమెంట్ స్టీల్ ఇసుక, నిర్మాణ రంగానికి అవసరమైన ముడి సరుకుల ధరలు విపరీతంగా పెంచడం వల్ల నిర్మాణాలు బాగా తగ్గిపోయి కార్మికులఉపాధి పై తీవ్ర ప్రభావం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ వలస కార్మికులు పెరిగిపోవడంతో కూలి రేట్లు, పనిగంటలు అమలుకాకుండా పోతున్నాయని అన్నారు. లేబర్ అధికారులు కార్మికుల అడ్డాలలో పేర్లు నమోదు చేసుకొని పనిలేని కార్మికులకు సగం వేతనం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్‌ను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8న కనగల్లులో జరిగే జిల్లా మహాసభకు భవన నిర్మాణ కార్మికులందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నల్లగొండ పట్టణ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు సలివోజుగా సైదాచారి, ఉపాధ్యక్షులుగా సాగర్ల మల్లయ్య, కావేరి నరసింహ, వేముల రామస్వామి, ప్రధాన కార్యదర్శిగా అద్దంకి నరసింహ, సహాయ కార్యదర్శిలుగా కత్తుల జగన్, ఉంగరాల సైదులు, ఓర్సు వెంకటేశ్వర్లు, ధర్పల్లి రామ్మూర్తి, కోశాధికారిగా దేవరంపల్లి వెంకట్‌రెడ్డి, ప్రచార కార్యదర్శిగా భీమనపల్లి శంకర్, మరో 18 మందితో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నలగొండ పట్టణ అధ్యక్షులు సాగర్ల మల్లయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి అద్దంకి నరసింహ, వివిధ యూనియన్ల అధ్యక్ష కార్యదర్శులు దేవరంపల్లి వెంకట్‌రెడ్డి, కత్తుల జగన్, కావేరి నరసింహ, దాసోజు ప్రభుచారి, కొత్తపెళ్లి యాదగిరి, పొన్నెబోయిన లింగస్వామి, భీమనపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.