Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాఉద్యమాలను బలపరచాలి
- మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యం
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
రాజకీయ ప్రయోజనాల కోసమే మునుగోడు ఉపఎన్నిక అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో మిర్యాలగూడ నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివద్ధి కోసమని రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారినట్లు చెపుకోవడంలో వాస్తవం లేదన్నారు. నిజంగా అభివద్ధి కోసమైతే బీజేపీలో చేరితే అభివద్ధి జరుగుతుందా అని ప్రశ్నించారు. మునుగొడులో గెలిచిన టీఆర్ఎస్ పార్టీయే అధికారంలో ఉంటాదని, అప్పుడు ఎలా అభివద్ధి జరుగుతుందని చెప్పారు. తన అభివద్ధి కోసమే పార్టీ మారాడని, ఇందులో బీజేపీ రాజకీయ ప్రయోజనం ఉందన్నారు. దక్షిణ తెలంగాణలో బలపడాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని, అక్కడి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని వాటిపై సీపీఐ(ఎం) చేపట్టే ప్రజాఉద్యమాలను బలపర్చాలని కోరారు. ఏ రాజ్యాంగం ఆధారంగా మోడి ప్రధాని అయ్యారో.. పరిపాలన చేస్తున్నారో.. ఆ రాజ్యాంగాన్నే ధ్వంసం చేయడానికి బీజేపీ ప్రభుత్వం పూనుకుంటుందని విమర్శించారు. గత 7 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసే పద్ధతులనే మోడీ ప్రభుత్వం అనుసరిస్తుందని విమర్శించారు. నిరుద్యోగంలో కూడా 20 నుండి 25 ఏళ్లున్న యువతను 42 శాతం నిరుద్యోగం వేధిస్తోందన్నారు. కొన్ని లక్షలు, కోట్ల సంఖ్యల్లో యువతకు ఉద్యోగాల్లేవని తెలిపారు. మరోవైపు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఆ ఖాళీలను పూరించే పని ప్రభుత్వం చేయడం లేదని ఆరోపించారు. నిరుద్యోగాన్ని పరిష్కరించే ఎలాంటి ఆలోచనలూ చేయడంలేదన్నారు. నిరుద్యోగంతోపాటు ధరలు కూడా పెరుగుతున్నాయన్నారు. గ్యాస్ ధరలతోపాటు అన్ని వస్తువుల ధరలు పెరిగి బతుకు తెరువు ఛిద్రమయ్యే రీతిలో మోడీ విధానాలు పనిచేస్తున్నాయని ఆవేధన వ్యక్తం చేశారు. ఆర్థిక రంగంలోనూ ఆర్థిక సంక్షోభంతో చిన్నచిన్న ఫ్యాక్టరీలన్నీ మూతపడుతున్నాయన్నారు. కోవిడ్ తరువాత మూతపడ్డ ఆ ఫ్యాక్టరీలన్నీ తిరిగి తెరిచే పరిస్థితి కూడా లేదన్నారు. పేదరికం, నిరుద్యోగం, ధరలు పెరుగుతున్నాయని, వీటన్నిటికీ పరిష్కారం చేసి ప్రజల బతుకు తెరువును మెరుగుచేసుకోవడానికి ఏదైనా ప్రత్యామ్నాయ దారి ఉందా అని మోడీ అడుగుతున్నారని.. వారిముందే ప్రత్యామ్నాయ దారులున్నాయని అన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ బడాబాబులకు రుణాలు మాఫీలు.. ఎవరి సొమ్ము అని ప్రశ్నించారు. మోడి వచ్చిన ఏడేళ్లలో బ్యాంకుల నుండి బడాబాబులు తీసుకున్న 11 లక్షల కోట్ల రూపాయల రుణం ఎవరిచ్చిందని ప్రశ్నించారు. బ్యాంకుల్లో ఉన్న ప్రజా సొమ్మును పెట్టుబడిదారులు, మోడి మిత్రులు రుణంగా తీసుకొని దాన్ని తిరిగి ఇవ్వడం లేదని ఆరోపించారు. అలాంటి 11 లక్షల కోట్ల రూపాయలను ఈ ఏడు సంవత్సరాల్లో మోడి మాఫీ చేశారని విమర్శించారు. పెట్టుబడిదారులకు పన్నులు తగ్గించి ప్రజలపై పన్నుల భారాన్ని మోడీ పెంచారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు రూ.2 లక్షల కోట్ల పన్నులను తగ్గించి లాభమిచ్చారన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, మల్లు గౌతమరెడ్డి, బావండ్ల పాండు, పాధురి శశిధర్ రెడ్డి, తిరుపతి రామూర్తి, రాగిరెడ్డి మంగారెడ్డి, రెమడాల పరుశురాం, ఆయూబ్, వినోద్‌నాయక్, వరలక్ష్మి, గాదె పద్మ, రొంది శ్రీనివాస్, సైదులు, తదితరులు పాల్గొన్నారు.