Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-చండూరు
అందరి గ్రామస్తుల, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే గట్టుప్పల్ మండల ఏర్పాటు చేశామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం గట్టుపల్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్, రెవెన్యూ ప్రభుత్వ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. అక్కడినుంచి లంబాడి నృత్యాలతో, ఆటపాటల, డీజేలతో ఊరేగింపు చేసుకుంటూ ర్యాలీతో సభకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గట్టుప్పల్ ప్రజల కొన్ని ఏండ్ల నిరీక్షణకు ఫలితం లభించి నట్లయ్యిందన్నారు. 2014 సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి పనులు తప్ప, 2018లో రాజగోపాల్‌రెడ్డి గెలిచిన తర్వాత అభివృద్ధి శూన్యం అయిందన్నారు. ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేశారో తెలియదన్నారు. రాజ్‌గోపాల్ రెడ్డి రాజీనామా అర్దం లేనిదని పేర్కొన్నారు. మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేయలేదని, తన స్వలాభం కోసమే, బహిరంగ మార్కెట్లో 22 వేల కోట్లకు అమ్ముడు పోయిన వ్యక్తి రాజ్ గోపాల్ రెడ్డి అని విమర్శించారు. కేంద్రం నుంచి మునుగోడుకు పైసా నైనా నిధులు ఇచ్చినరా.. అని ప్రశ్నించారు. ద్రోహం,స్వార్దం తప్పా అభివృద్ధి చేయాలనే సోయి లేదన్నారు. మళ్లీ జనంలో తిరుగుతూ తన రాజీనామా వల్లే గట్టుపల్ మండలం ఏర్పాటు, నూతన పెన్షన్లు వస్తున్నారు అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఉప ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రజల జేబులకు చిల్లులు పెట్టడమే బీజేపీ లక్ష్యమన్నారు. బీజేపీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లు రావడం ఖాయమన్నారు. టీఆరెఎస్‌కు ఓటేస్తే ఇంటింటికీ తాగు నీరు, ప్రతి ఎకరానికి సాగు నీరు పారుతుందన్నారు. సంక్షేమం కావాలో ? సంక్షోభం కావాలో మునుగోడు ప్రజలు తేల్చుకోవాలి అన్నారు. దేశమంతా తెలంగాణ రాష్ట్రం మాదిరిగా కావాలని, దేశ మొత్తం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అన్నారు. మంత్రికి బతుకమ్మతో స్వాగతం పలికారు. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ తకేనాపల్లి రవీందర్రావు, సర్పంచ్ ఇడెం రోజా, మండల సాధనకై కన్వీనర్ ఇడెం కైలాసం, ఎంపిటిసిలు అవ్వారు గీత శ్రీనివాస్, చేరిపల్లి భాస్కర్, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులుగొరిగే సత్తయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ముడిగా ఎర్రన్నయాదవ్, తదితరలు పాల్గొన్నారు.