Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేతన సవరణ కోసం 15రోజులుగా కార్మికుల దీక్షలు
- రెండు నెలలుగా అందని వేతనాలు
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
వారంతా కంపేనీ అభివృద్ది కోసం దాదాపు 17ఏండ్లుగా రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు... ఏనాడూ తమ వేతనాల కోసం పట్టుపట్టిందిలేదు.. యాజమాన్యం చెప్పినట్లుగానే వేతనాలు చెల్లిస్తే మాట మాట్లాడకుండా పనిచేశారు.కరోనా కాలంలో కూడా దేశంలోని అన్ని సంస్థలు మూత పడితే ఆ కంపెనీ కార్మికులు మాత్రం ఉత్పత్తి నిలిచిపోవద్దని మేనేజ్మెంట్ ఆదేశాలు జారీచేస్తే ఆ ఉత్తర్వులను తూ.చ తప్పకుండా పాటించారు.అలాంటి కార్మికులు నేడు పండుగ పూట పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది.కొద్దిరోజులుగా వేతన సవరణ చేయాలనే ప్రధాన డిమాండ్‌తో కంపెనీ ముందు ఎండకు ఎండుతూ... వర్షానికి తడుస్తూ దీక్షలు చేస్తున్నారు.కంపెనీ మేనేజ్మెంటు పండుగ పూట ఎంజరు చేస్తుంటే వారి ఎదుగుదలకు బాటలు వేసిన కార్మికులు ఒకపూట తిండిలేక పస్తులుండే పరిస్తితి వచ్చింది.
17 ఏండ్లుగా కంపెనీ కోసం కార్మికులు ...
దాదాపు 1995లో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామంలో ప్రతిష్టకంపెనీని ఏర్పాటు చేశారు. సుమారు 100మంది రెగ్యులర్ ఉద్యోగులు పనిచేస్తుండగా 150మంది కాంట్రాక్టు కార్మికులు, మరో 50మంది ఆఫీస్ సిబ్బంది పనిచేస్తుంటారు.ఇందులో పనిచేసే వాళ్లంతా చుట్టుపక్కల చౌటుప్పల్, వలిగొండ, రామన్నపేట మండలాలకు చెందినవారే.ఈకంపెనీలో వ్యవసాయానికి సంబందించిన సేంద్రీయ ఎరువులు, చేపలు, గేదేలకు వేసే ఫీడ్‌ను ఉత్పత్తి చేస్తుంటారు.
వేతన సవరణ కోసం పోరాటం..
కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు కార్మిక చట్టం ప్రకారం ప్రతి రెండేండ్ల కోసారి వేతన సవరణలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కంపెనీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు మూడుసార్లు వేతన ఒప్పందం చేశారు.కానీ ఈ కంపేనీ యాజమాన్యం మాత్రం మూడేసార్లు చేశారు. 2015, 2017, 2019లో చేయగా ఆ మూడుసార్లు నాటికి కార్మికులకు ఇస్తున్న వేతనాలకు రెండు కేటగిరిలు చేసి హెల్పర్స్‌కు రూ.3500, ఆపరేటర్స్‌కు రూ.4200చొప్పున చెంచారు. చట్టం ప్రకారం గతేడాది కింద కంపెనీ వేతన ఒప్పందం చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఆలాంటి చర్యలు తీసుకోలేదు.రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో పాటుగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెద్దఎత్తున పెరిగాయి.వాటికి అనుగుణంగా వేతనాలు పెంచాలని కార్మికుల పక్షాన యూనియన్ ఎప్పటికపుడు యాజమాన్యానికి విన్నవిస్తూనే ఉంది.కానీ వారిలో చలనంలేదు. 2021 అక్టోబర్ 10న కంపేనీ యాజమాన్యానికి వేతన ఒప్పందం చేయాలని వినతి పత్రం అందజేసి అయినా స్పందన లేదు. ఇక తప్పని పరిస్థితిలో సెప్టెంబర్ 22నుంచి కార్మికులు వేతనాల ఒప్పందం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో, పాటుగా పెండింగ్‌లో ఉన్న పండుగ బోనస్‌లను వెంటనే చెల్లించాలని, ప్రతినెలా 7వ తేదీలోపు వేతనాలు ఇవ్వాలని ప్రతిష్ట ఇండిస్టీస్ లిమిటెడ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటీయూ) ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు.
కంపెనీలో కనీసవసతులు కరువు...
దాదాపు 17 ఏండ్లుగా కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వసతులు లేవు.కంపెనీలో పనిచేసే కార్మికులకు యూనిఫామ్ పేరుతో చొక్కా( షర్టు) మాత్రమే అందజేసి, ప్యాంట్‌ను ఇవ్వడంలేదు. అది కూడా ఏడాదికి ఒకసారి మాత్రమే.కంపెనీలో పనిచేసే కార్మికులకు పనిచేస్తున్న చోట ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు పరికరాలు ఇవ్వాల్సిన మేనేజ్మెంటు వాటిని ఎపుడో మరిచిపోయింది.కంపెనీలో పనిచేసే కార్మికుల ఆరోగ్యం కాపాడుకునేందుకు ప్రతి రోజు 100గ్రాముల బెల్లం, రెండు ఆరటిపండ్లు ఇవ్వాలని కోరుతున్నా వాటిని లెక్క చేయకుండా గాలికి వదిలేస్తున్నారు. మహిళ కార్మికులు కంపెనీలో బరువులు ఎత్తే క్రమంలో దెబ్బలు తగిలితే కనీసం వైద్యం కూడా చేయించే పరిస్థితి లేదు. విచిత్రమైన విషయం ఎమిటంటే కంపేనీలో కనీసం బాత్రూం సౌకర్యం కూడ లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అన్ని వసతులు కల్పిస్తున్నామని చెపుకునే యాజమాన్యం కార్మికులను ఏలా మోసం చేస్తుందో చూడొచ్చు.
10రోజులుగా కంపెనీ ముందే దీక్షలు
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో ప్రతిష్ట ఇండిస్టీస్ లిమిటెడ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2 నుంచి కంపెనీ ముందే సమస్యల పరిష్కారం కోసం నిరవదిక దీక్షలు చేస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్కడే వంటా వార్పు చేసుకుంటూ కంపెనీ ముందే కూర్చున్నారు. కార్మికులు దీక్షలు చేపట్టిన నాటి నుంచి ఎండలు, వర్షాలు ఒకే విధంగా ఉన్నాయి.అయినా వాటిని లెక్క చేయకుండా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ కార్మికులంతా ఐక్యంగా దీక్ష శిబిరంలోనే ఉంటున్నారు.యాజమాన్యం కార్మికుల మద్య విబేధాలు సృష్టించడానికి అనేక కుట్రలు చేస్తున్నప్పటికి నాయకత్వం వాటిని ఎప్పటికపుడు పసిగడుతూ కార్మికులను ఐక్యంగా ఉంచుతుంది.దాదాపు 15రోజులుగా దీక్షలు చేస్తుంటే దీక్షలకు పిలవాల్సిన యాజమాన్యం పోలీసులతో భయపెట్టించి చర్చలు చేయాలని చూస్తుంది.అయినా పట్టువదలని విక్రమార్కుల మాదిరిగా కార్మికులు దీక్షా శిబిరంలో మరింత చైతన్యంతో ఉన్నారు.ఈ దీక్షలకు వివిధ ప్రజాసంఘాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి.
వేతనాలు పెంచాల్సిందే
గడ్డం వెంకటేశం, ప్రతిష్ట కంపెనీ కార్మిక యూనియన్ కార్యదర్శి
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు వేతనాలు పెంచాల్సిందే.గతంలో కంపెనీ యాజమాన్యం చెప్పిన విధంగానే వేతనాల పెంపుదలను ఒప్పుకున్నాం. కంపెనీలోకనీస సౌకర్యాలు బాత్రూం, క్యాంటిన్ సౌకర్యం కూడలేదు. ఇన్నాళ్లుగా కంపెనీ అభివృద్దికి తోడ్పడిన కార్మికులకు రెండుపూటల తిండి తినేందుకు అవసరమైన వేతనాలు ఇవ్వకపోతే ఎలా పనిచేస్తారు.సమస్యలు పరిష్కరించే వరకు దీక్షలు కొనసాగిస్తాం.
దీక్షలను విచ్చిన్నం చేయడానికి యాజమాన్యం కుట్ర
కల్లూరి మల్లేశం,సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు,
వర్కింగ్ ప్రసిడెంట్ ప్రతిష్ట కంపెనీ కార్మిక యూనియన్
న్యాయబద్దమైన సమస్యల పరిష్కారం కోసం కార్మికులు శాంతియుతంగా దీక్షలు చేస్తుంటే కంపెనీ యాజమాన్యం దీక్షలు విచ్ఛిన్నం చేయడానికి కుట్ర చేస్తుంది.ఆ పద్ధతిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించం. పోలీసుల బెదిరింపులతో చర్చలు చేయాలని చూస్తోంది.ఇప్పటివరకు కనీసం చర్చలకు పిలవకపోవడం మేనేజ్మెంట్ వైఖర్ని స్పష్టం చేస్తుంది. కార్మిక సమస్యల పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగుతుంది.