Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
మతోన్మాద విధానాలను అనుసరిస్తూ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని తహతహలాడుతున్న బీజేపీ ఓటమే లక్ష్యంగా సీపీఐ(ఎం) పనిచేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు.సోమవారం స్థానిక మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్లో నిర్వహించిన జిల్లా కేంద్రబాధ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ యత్నిస్తుందన్నారు.ఆ ప్రయత్నాలను ప్రజలంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఎలాగైనా గెలవాలనే పేరుతో విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేస్తూ ఆయా గ్రామాలలో ప్రజా ప్రతినిధులను అంగటిలో సరుకు లాగా కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.మతోన్మాద బీజేపీని ఓడించేందుకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ను బలపరిచామన్నారు.ఎన్నికల్లో బలపరిచిన మాత్రాన ప్రజాసమస్యలపై ఊరుకోమని, సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం నిర్వహిస్తామన్నారు. కమ్యూనిస్టులపై టీపీసీసీ అధినేత రేవంత్రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు.కమ్యూనిస్టులకు అమ్ముడు పోవాల్సిన అవసరం లేదని ప్రమాదకరంగా ఉన్న బీజేపీ ఓటమి తమ రాజకీయ లక్ష్యమన్నారు.కమ్యూనిస్టులపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజలపై పెట్రోల్,డీజిల్, వంటగ్యాస్ ధరలను విపరీతంగా పెంచి పేద ,మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపిందని విమర్శించారు.కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుందన్నారు.ధరలు పెరిగి పేదల కొనుగోలుశక్తి తగ్గి ఇబ్బందులు పడుతుంటే కార్పొరేట్శక్తులు, బడా పారిశ్రామికవేత్తల లాభాలు మాత్రం వందల కోట్లకు పెరుగుతున్నాయని విమర్శించారు.ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేట్పరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అక్రమంగా ప్రజల సంపదను కట్టబెడుతుందన్నారు.రైతు పోరాటాలకు తలొగ్గిన మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక మూడుచట్టాలను రద్దు చేసిందని గుర్తు చేశారు.సీపీఐ(ఎం) పోరాటఫలితంగా ప్రభుత్వం ఇటీవల పింఛన్లను మంజూరు చేసిందన్నారు.అలాగే ఎన్నో దశాబ్దాలుగా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని పార్టీ పోరాడిందని గుర్తు చేశారు.ఆ పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ హామీని అమలుచేస్తూ జీవో విడుదల చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.టీఆర్ఎస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీసభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టియాదగిరిరావు,మట్టిపల్లి సైదులు, కోటగోపి, ఎల్గూరిగోవింద్, వేల్పుల వెంకన్న, జిల్లపల్లి నర్సింహారావు, ధనియాకుల శ్రీకాంత్, వీరబోయిన రవి పాల్గొన్నారు.