Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాగుపై బ్రిడ్జి ఎప్పుడు నిర్మిస్తారు..
నవతెలంగాణ-ఆలేరురూరల్
అసలే వర్షాకాలం వాగులు, వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. మూడు నెలలుగా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు నిరంతరం పారుతూ నాచు పట్టిజారుతున్నాయి. ప్రయాణం చేయాలంటే వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దాటుతున్నారు. ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామానికి ఆనుకొని ఉన్న బిక్కేరు వాగు మూడు నెలల నుండి నిరంతరం ప్రవహిస్తోంది. మండలానికి కూతవేటు దూరంలో బిక్కేరు వాగు ప్రవహిస్తోంది. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణం చేస్తూ ఉంటాయి ఆలేరు నుండి సిద్దిపేటకు వెళ్లే ప్రధాన రహదారి ఇది రెండు నెలల నుండి ఈ వాగు గుండ ప్రయాణం చేస్తూ చాలామంది వాగులో పడి ప్రాణాలు కాపాడుకోవాల్సి వచ్చింది.
తృటిలో తప్పిన ప్రమాదాలు
నెలరోజుల కింద ఆలేరు నుండి పోచన్నపేటకు వెళ్లే ఉపాధ్యాయురాలు స్కూటీ నుండి వాగు దాటుతున్న క్రమంలో ఒక్కసారిగా జారి లోయలో పడిపోయింది. గమనించిన స్థానికులు వాగులోకి దిగి ఉపాధ్యాయురాలు ప్రాణాలు కాపాడారు. ఈ విషయంపై ప్రజాప్రతినిధులు తొందరలోనే బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఇంతవరకు కూడా దాని ఊసే లేదు.ఆలేరు నుండి వృద్ధులు చేర్యాలకు వెళ్లే క్రమంలో గత నెల 20న ఎక్సెల్ బండి నుండి ఒక్కసారిగా వాగులో పడి కొట్టుకుపోతున్న సందర్భంలో వెంబడే ఉన్న వాహనదారులు వృద్ధులను తాడు సహాయంతో బయటికి లాగారు. గత నెల 25న కొలనుపాక గ్రామం నుండి ఆలేరుకు ఆటో ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళుతున్న క్రమంలో బ్రిడ్జి మీద నాచుకు జారి వాగులోపడింది. గమనించిన గ్రామ ప్రజలు తాడు సహాయంతో బయటికి లాగారు. ఆటో కార్మికునికి స్వల్ప గాయాలు కావడంతో ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు చేపడతారు..
-వెంకటేశ్వరరాజు (కాంగ్రెస్ మండల అధ్యక్షుడు )
వాహనదారులు ఈ వాగు గుండ పోవాలంటే ప్రాణాలు అరచేతులు పెట్టుకొని పోవాల్సి వస్తుంది ఎంతోమంది ఈ వాగులో పడి ప్రాణాలు కాపాడుకున్నారు .గతంలో అయితే ప్రాణాలు కోల్పోయారు . ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయాలి.
ప్రమాద బోర్డులు ఏర్పాటు చేయాలి
-సొంటెం కవిత( కొలనుపాక ఎంపీటీసీ)
మూడు నెలల నుండి నిరంతరం ప్రవహిస్తున్న వాగును ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు .ఎంతోమంది ఈ వాగులో పడి గాయాల పాలయ్యారు. అధికారులు చొరవ తీసుకొని సూచిక బోర్డు ఏర్పాటు చేయాలి. స్థానిక ఎమ్మెల్యే బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి చేయాలి