Authorization
Wed March 19, 2025 07:11:20 am
- 20న సాయిబాబా గుడి నుండి ఏఆర్ గార్డెన్స్ వరకు ప్రదర్శన, సభ
- అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి డిమాండ్ .
నవతెలంగాణ - భువనగిరి
ఈనెల 20, 21 తేదీల్లో భువనగిరి ఏఆర్ గార్డెన్స్ లో అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర 4 వ మహాసభలు జరుగనున్నాయని అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జయలక్ష్మి తెలిపారు. శనివారం స్థానిక సుందరయ్య భవన్ లో జరిగిన అంగన్వాడీ యూనియన్ జిల్లా కమిటి సమావేశంలో ఆమె మాట్లాడుతూ గడిచిన మూడేండ్ల కాలంలో యూనియన్ ఆధ్వర్యంలో చేసిన పోరాటాలను సమీక్షించుకొని రానున్న మూడేండ్ల కాలంలో చేయబోయే పోరాట కార్యక్రమాలను రూపొందించుకోనున్నట్టు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేండ్ల కాలంలో ఐసీడీఎస్ స్కీంకు నిధులను క్రమంగా తగ్గిస్తూ ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి అంగన్వాడీ సెంటర్స్‌ను మూసేయాలని చూస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పనిభారం తగ్గించాలని అన్నారు. జీఓ నెం 14 19 లను సవరించి ఉద్యోగ భద్రత, గ్రాట్యుటి, పెన్షన్ ఇవ్వాలని అన్నారు. జిఓ నెం 8 ని సవరించాలన్నారు. మహాసభల ప్రారంభ రోజు 20 న ఉదయం 9.00 గంటలకు పాత బస్టాండ్ దగ్గరలోని సాయిబాబా గుడి నుండి ఏఆర్ గార్డెన్స్ వరకు అంగన్వాడీ ఉద్యోగులు ఎర్రచీరలు ధరించి ప్రదర్శనలో పాల్గొననున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బూరుగు స్వప్న, చిలువేరు రమాకుమారి, నాయకులు భాగ్య, సునీత,శోభ, పద్మ, వాణశ్రీ, వసంత, షాహెద, పద్మాబాయి, కళ్యాణి, కవిత, రూప, పుష్ప, కళావతి పాల్గొన్నారు.