Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్‌కు నోటీసు అందజేసిన కౌన్సిలర్లు
నవతెలంగాణ-నల్లగొండకలెక్టరేట్
నల్లగొండ జిల్లా మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మానాల సెగలు క్రమంగా పెరుగుతున్నాయి. గత సోమవారం చండూరు మున్సిపాలిటీలో మొదలైన అవిశ్వాస ప్రతిపాదనల అసమతి సెగ నేడు నందికొండ ( నాగార్జునసాగర్ )ను తాకింది. చైర్పర్సన్, వైస్ చైర్మెన్ మినహా10 మంది మున్సిపల్ కౌన్సిలర్ల సంఖ్య ఉన్న ఈ మున్సిపాలిటీలో గత నాలుగు నెలల క్రితం సత్తెమ్మ అనే కౌన్సిలర్ గుండెపోటుతో మరణించగా ఇంకా 9 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అసమ్మతి వర్గానికి చెందిన ఏడుగురు బీఆర్ఎస్, ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రస్తుత చైర్ పర్సన్ కర్నే అనుష రెడ్డి, వైస్ చైర్మెన్ మందా రఘువీర్లపై అవిశ్వాసాన్ని కోరుతున్నారు. చైర్ పర్సన్, వైస్ చైర్ చైర్మెన్లపై అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తూ బుధవారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్భు గుప్తాకు నోటీసులు అందజేశారు.
నిధుల దుర్వినియోగం వల్లే...
అక్కడ ఆస్తి పన్ను ఉండదు.. కొత్త నిర్మాణాలు ఉండవు. గ్రామపంచాయతీ కూడా కానీ నందికొండ మున్సిపాలిటీగా అవతరించింది. 2018 ఆగస్టు 2న మున్సిపాలిటీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గ్రామ పంచాయతీ కూడా కానీ నందికొండ ను మున్సిపాలిటీగా మార్చడం అప్పట్లో రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత సంచరించుకుంది. కమిషనర్ మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్, సిడిఎంఏ ప్రత్యేక నిధులతోనే మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులు, ఎస్డీఎఫ్ నేటికీ దాదాపు 25 కోట్ల పైనే వచ్చాయని ఆ నిధులన్నీ చైర్ పర్సన్ అనూషరెడ్డి వారి మామ బ్రహ్మరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డిలతో కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, వచ్చిన నిధులను సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, స్థానిక ఎమ్మెల్యే విషయంపై పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నాఢని పలువురు కౌన్సిలర్లు ఆరోపించారు. ప్రస్తుత చైర్పర్సన్, వైస్ చైర్మన్ లు అధికార పార్టీకి చెందిన వారు అయినప్పటికీ గడిచిన మూడు సంవత్సరాల కాలంలో ఎక్కడ ప్రజలకు అవసరమయ్యే ఏ ఒక్క అభివృద్ధి పనిని చేపట్టలేదనే ఆరోపణలతోనే కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని అదనపు కలెక్టర్‌ను కలిశారు.
త్వరగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి...
అవిశ్వాస తీర్మానాన్ని త్వరగా ప్రవేశపెట్టాలని కౌన్సిలర్లు అదరపు కలెక్టర్‌ను కోరారు. గతంలో ఏ ప్రభుత్వం నాగార్జునసాగర్ అభివద్ధిని పట్టించుకోలేదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నాగార్జునసాగర్‌ను నందికొండ మున్సిపాలిటీగా మారుస్తూ అభివృద్ధి కోసం నిధులు కేటాయించారన్నారు. నిధులు కేటాయించినప్పటికీ ఆ నిధులను దుర్వినియోగం చేసి నందికొండను అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచారని కౌన్సిలర్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే నిధులను వాడుకొని అభివృద్ధి చేసే విధంగా తామంతా పనిచేస్తామని జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నందికొండ ను అభివృద్ధి పథంలో నడిపిస్తామని పేర్కొంటున్నారు. నూతన మున్సిపల్ చైర్మెన్ ఎన్నికలో తమ పూర్తి మద్దతు ఉంటుందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు తెలిపారు.
నెక్స్ట్ ఎవరు...?
నందికొండ మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానం పెడితే నెక్స్ట్ మున్సిపల్ చైర్మెన్ ఎవరు అవుతారు అనేది ప్రశ్న గా మారింది. ఏడుగురు బీఆర్ఎస్, ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు. మున్సిపాలిటీలో మెజార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నందున బీిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి, 11వ వార్డ్ కౌన్సిలర్ నంద్యాల శ్వేతారెడ్డిని ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కౌన్సిలర్లు వైస్ చైర్మెన్ పై కూడా అవిశ్వాసాన్ని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ లు ఇద్దరే ఉన్నందున వైస్ చైర్మన్ పదవి కూడా వారికి వచ్చే అవకాశం లేదు. మెజార్టీ సరిపోని కారణంగా వైస్ ఛైర్మెన్ పదవి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే దక్కే అవకాశం ఉంది. అయితే అభ్యర్థి ఎవరు అనేది మాత్రం తేలవలసి ఉంది.
నిబంధనల ప్రకారమే ముందుకు...
నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్తామని, నందికొండ అవిశ్వాస తీర్మానంపై జిల్లా అదనపు కలెక్టర్ ఖుష్భు గుప్తా కౌన్సిలర్లకు తెలిపారు.