Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర కమిటీ సభ్యులు బండా శ్రీశైలం
నవతెలంగాణ-మర్రిగూడ
రైతాంగ సమస్యలపై సమరశీల పోరాటం చేసేందుకు కౌలు రైతులు తెలంగాణ రైతు సంఘంలో చేరండి అని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండా శ్రీశైలం పిలుపునిచ్చారు. బుధవారం మర్రిగూడ మండలం ఇందుర్తి గ్రామంలో ప్రజా సంఘాల సభ్యత్వం కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడారు. అర్హత కలిగిన వారికి ఇండ్లు, ఇండ్ల స్థలాలు తప్పనిసరిగా ఇవ్వాలని, ఇంటి స్థలం కలిగిన ప్రతి నిరుపేదకు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు అందచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3న మర్రిగూడ తాసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం అర్హత కలిగిన ప్రజలందరూ దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, గిరి వెంకటయ్య, గడగోటి వెంకటేష్, ఏర్పుల దుర్గమ్మ, పగిళ్ల రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు.